Tirumala Brahmotsavam Garuda Vahana Seva 2024 : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామి వారికి అత్యంత విశేషంగా నిర్వహించే గరుడ వాహన సేవ కోసం అధికారులు ప్రత్యేక ప్రణాళికలు ఏర్పాటు చేశారు. నేటి అర్థరాత్రి నుంచి కనుమ రహదారుల్లో ద్విచక్రవాహనాలను నిషేధించటంతో పాటు, కొండ కింద అలిపిరి వద్ద వెహికల్స్ పార్కింగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. గరుడ సేవకు పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.
దాదాపు 3.5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు ఈవో వెల్లడించారు. ప్రధాన కూడళ్లలో అన్నప్రసాదం అందుబాటులో ఉంటుందని, తిరుమల కొండపైకి ఎక్కువ వాహనాలు వచ్చేందుకు వీల్లేదని అన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ 400కు పైగా బస్సులు ఏర్పాటు చేసిందని, 3 వేల ట్రిప్పులు నడిపేందుకు వీలుగా ఏర్పాట్లు చేశామని ఈవో శ్యామలరావు తెలిపారు. మాడ వీధుల గ్యాలరీల్లో 2 లక్షల మంది భక్తులు వాహన సేవను తిలకించేందుకు వీలు ఉందన్నారు.
ముఖ్యమైన కూడళ్లలో డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 1200 మంది టీటీడీ విజిలెన్స్, 3800 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరా నిఘాలో తిరుమల మొత్తం మానిటరింగ్ చేస్తామన్నారు. గ్యాలరీలో భక్తులకు అన్న ప్రసాదాలు, పాలు, మజ్జిగ నిరంతరాయంగా పంపిణి చేస్తామన్నారు. గరుడ సేవ రోజున మాడవీధుల్లో బయట ఉన్న భక్తులకు టీవీ స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నామని, మెడికల్ క్యాంపులు అందుబాటులో ఉంటాయన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.