BR Naidu on Vaikunta Ekadashi : ప్రపంచవ్యాప్తంగా హిందువులు వైకుంఠ ద్వార దర్శనంపై మాట్లాడుతున్నారని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు. పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈనెల 10న ఉదయం 4:30 గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు, 8:00 గంటలకు సర్వదర్శనం ప్రారంభం కానునట్లు చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
టోకెన్లు కలిగిన భక్తులకే దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నట్లు బీఆర్ నాయుడు తెలిపారు. ఈనెల 10న ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్వర్ణ రథం ఊరేగింపు ఉంటుందని చెప్పారు. అన్ని ప్రత్యేక దర్శనాలను పది రోజుల పాటు రద్దు చేశామని పేర్కొన్నారు. సామాన్య భక్తుల కోసం సిఫార్సు లేఖల దర్శనం రద్దు చేసినట్లు వివరించారు. తిరుపతిలోని టోకెన్ల జారీ కేంద్రాల వద్ద ఇప్పటికే భక్తులతో కిక్కిరిసిపోయాయని వెల్లడించారు. ఈ క్రమంలోనే కేంద్రాల వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని తెలియజేశారు. కొత్త వైరస్ ప్రభావం నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులు మాస్క్ ధరించాలని బీఆర్ నాయుడు సూచించారు.
మరోవైపు వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రధాన ఆలయంతో పాటు తిరుమల పరిసర ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ స్వామివారి దర్శనం కల్పించేలా నిర్ణయం తీసుకుంది. పోలీసు, విజిలెన్స్ సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టింది. ఈ నెల 10 నుంచి 19 వరకు ఏడు లక్షల మందికి ఉత్తర ద్వార దర్శనం కల్పించేలా ఇప్పటికే ఆన్‌లైన్‌లో కొన్ని టికెట్లను విడుదల చేశారు. గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచి తిరుమల, తిరుపతిలోని ప్రత్యేక కౌంటర్ల ద్వారా సర్వదర్శన టోకెన్ల జారీ ప్రక్రియను టీటీడీ చేపట్టనుంది.