TTD Cancelled VIP Break Darshan:తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. రథసప్తమి(ఫిబ్రవరి 4) నాడు పలు సేవలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటన విడుదల చేశారు. మినీ బ్రహ్మోత్సవాలుగా భావించే ఈ రథసప్తమి వేడుకలకు దాదాపు లక్ష మంది భక్తులు వస్తారని అంచనా వేస్తుండగా, వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా స్వామి వారి దర్శనం కల్పించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు సేవలను రద్దు చేసినట్లు ప్రకటించారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రథసప్తమి వేడుకలకు సంబంధించి ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 5వ తేదీవరకు 3 రోజుల పాటు తిరుపతిలో స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్ఎస్‌డీ) టోకెన్లు జారీ చేయడం లేదని టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. భక్తులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అలాగే రథసప్తమి సందర్భంగా తిరుమలలో పలు సేవలు, ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. తిరుమల శ్రీవారికి నిత్యం జరిపించే అష్టాదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ వంటి సేవలను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రవాస భారతీయులు(NRI), చిన్న పిల్లల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు కల్పించే ప్రివిలేజ్ దర్శనాలు ఆ రోజున ఉండవని టీటీడీ ఈవో స్పష్టం చేశారు.
వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు: ఫిబ్రవరి 4న రథసప్తమి వేడుకల సందర్భంగా ప్రొటోకాల్ ఉన్న ప్రముఖులకు మినహా మిగిలిన వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు వివరించారు. అలాగే బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఫిబ్రవరి 3వ తేదీన ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించడం లేదని తెలిపారు. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనం(రూ.300) టోకెన్లు ఉన్న భక్తులు ఎక్కువ సమయం క్యూ లైన్లలో వేచి ఉండకుండా ఉండేందుకు నిర్ణీత సమయంలో మాత్రమే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద రిపోర్టు చేయాలని భక్తులకు ఈవో సూచించారు.
ఫిబ్రవరి 4న రథసప్తమి సందర్భంగా తిరుమలలో శ్రీవారి వాహనసేవలు:
సూర్యప్రభ వాహన సేవ - ఉదయం 5.30 గంటల నుంచి 8 గంటల వరకు.
చిన్నశేష వాహన సేవ - ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు
గరుడ వాహన సేవ - ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు