TTD BOARD Chairman BR Naidu :ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీటీడీ పాలకమండలిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేసారు. మిత్రపక్షాలైన జనసేన నుంచి ముగ్గురు, కేంద్ర బీజేపీ సూచించిన ముగ్గురికి అవకాశం దక్కింది. బోర్డులో అయిదుగురు మహిళలకు సభ్యులుగా చోటు దక్కింది. తొలిసారిగా భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ చేసిన మాజీ జస్టిస్‌కు సభ్యునిగా బాధ్యతలు అప్పగించారు. ఒక ప్రవాసాంధ్రునికి కూడా సభ్యునిగా అవకాశం దక్కింది. తొలుత బుధవారం నాడు (అక్టోబర్ 30) 24 మందితో బోర్డును ప్రకటించగా తాజాగా నలుగురు ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి మొత్తం 29మంది తో పాలకమండలి ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది.
టీడీపీలో అంకిత భావంతో పనిచేసిన నన్నూరి నర్సిరెడ్డి, మల్లెల రాజశేఖర్ గౌడ్, వైద్యం శాంతారాం, తమ్మిశెట్టి జానకీదేవి తదితరులకు టీటీడీ సభ్యులుగా పనిచేసే అవకాశం కల్పించారు. సామాన్య రైతు కుటుంబానికి చెందిన బొల్లినేని రాజగోపాల్ నాయుడు (బిఆర్ నాయుడు) అంచెలంచెలుగా ఎదుగుతూ టీటీడీ బోర్డు ఛైర్మన్ స్థాయికి చేరారు. ఆయన తల్లిదండ్రులు మునిస్వామినాయుడు, లక్ష్మి. బీహెచ్‌ఈఎల్‌లో ఉద్యోగిగా ప్రస్థానాన్ని ప్రారంభించి ఉద్యోగ సంఘం నాయకుడుగా పని చేశారు. ట్రావెల్, మీడియా రంగాల ద్వారా వ్యాపారవేత్తగా ఎదిగారు.
శ్రేయ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు ఉచితంగా కాటరాక్ట్ శస్త్రచికిత్సలు, ఇతర వైద్య సేవలను అందించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కొవిడ్ సమయంలోనూ ఆయన సేవలు అందించారు. తన ఛానల్ ద్వారా హిందూ ధర్మం, ఆధ్యాత్మిక విలువలను ప్రోత్సహించడంతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేశారు. ప్రతిష్టాత్మక మఠాల పీఠాధిపతులను ఆహ్వానించి చర్చలు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్‌ను మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు 1983 సంవత్సరంలో చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో పాల్గొన్నారు. అప్పటి నుంచి చంద్రబాబుతో సాన్నిహిత్యం ఏర్పడింది.
జ్యోతుల నెహ్రూ జగ్గంపేట ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించలేకపోయారు. దీంతో టీటీడీ సభ్యుడిగా ఆయనకు అవకాశం కల్పించారు. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వైకాపా నుంచి తెదేపాలో చేరి కోవూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో ఆమె టీటీడీ సభ్యురాలిగా, దిల్లీలో స్థానిక టీటీడీ సలహామండలి ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. ఎంఎస్ రాజు మడకశిర ఎమ్మెల్యే, ఎస్సీ వర్గానికి చెందిన యువ నాయకుడు ఎంఎస్ రాజును తెలుగుదేశం అధిష్ఠానం ప్రోత్సహిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆయనపై 60 పైగా కేసులు నమోదయ్యాయి.
అక్కిన మునికోటేశ్వరరావు రాజమహేంద్రవరం సమీపంలోని రఘదేవపురానికి చెందిన ఈయన వ్యాపారవేత్త. వ్యవసాయ కుటుంబానికి చెందిన వారు. ఇతర రాష్ట్రాల్లో కాంట్రాక్టర్‌గా పని చేస్తుంటారు. సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. నైపుణ్యాభివృద్ధి కేసులో చంద్రబాబు రాజమహేంద్రవరం జైల్లో ఉన్నప్పుడు భువనేశ్వరి, బ్రాహ్మణి, లోకేశ్ సహా పార్టీ ముఖ్యనేతలు, యువగళం వాలంటీర్లు కోటేశ్వరరావు ఇంట్లో 53 రోజులు బస చేశారు.
సుచిత్ర ఎల్ల భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఎల్ల ఫౌండేషన్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కరోనా సమయంలో భారత్ బయోటెక్ కొవిడ్ -19 టీకా తయారు చేసి ప్రపంచానికి అందించింది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆమె టిటిడి సభ్యురాలిగా పని చేశారు. తమ్మిశెట్టి జానకీదేవి మంగళగిరికి చెందిన ఈమె టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు. టీడీపీలో ఉన్న గంజి చిరంజీవి ఎన్నికలకు ముందు వైకాపాలో చేరారు. జానకీదేవి నారా లోకేశ్ సమక్షంలో తెదేపాలో చేరారు. చేనేత వరానికి చెందిన ఆమె టీడీపీ కార్యక్రమాల్లో చురుగా పాల్గొంటున్నారు. ఆమె గతంలో భాజపా తరపున అసెంబ్లీకి పోటీ చేశారు.
నన్నూరి నర్సిరెడ్డి తెలంగాణలోని యాదాద్రి-భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన నర్సిరెడ్డి టీడీపీలో విద్యార్థి నాయకుడి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం టీడీపీ జాతీయ అధికారి ప్రతినిధిగా ఉన్నారు. 1996లో తెలుగు నాడు విద్యార్థి ఫెడరేషన్ (టీఎన్‌ఎస్‌ఎఫ్)లో చేరారు. ఓయూలో టీఎన్‌ఎస్‌ఎఫ్ అధ్యక్షుడిగా, తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ అధికార ప్రతినిధిగా పని చేశారు. నన్నపనేని సదాశివరావు రాజధాని ప్రాంతంలోని దొండపాడుకు చెందిన ఆయన నాట్కో గ్రూపు వైస్‌ఛైర్మన్ దొండపాడు గ్రామాభివృద్ధికి తోడ్పడ్డారు. నాట్కో తరఫున గుంటూరులోని జీజీహెచ్‌లో క్యాన్సర్ యూనిట్ ఏర్పాటుకు, జీజీహెచ్‌లో పలు అభివృద్ధి పనులకు సహకారం అందించారు. నాట్కో ట్రస్టులో కీలకంగా వ్యవహరిస్తూ సహాయ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లారు.
జాస్తి పూర్ణసాంబశివరావు హైదరాబాద్‌కు చెందిన ఆయన అమెరికాలోని డల్లాస్‌లో స్థిరపడ్డారు. రియల్ ఎస్టేట్, సాప్ట్‌వేర్ రంగంలో ఉన్నారు. పనబాక లక్ష్మి, కృష్ణయ్య దంపతులు ఇటీవలి ఎన్నికల్లో లోక్‌సభకు పోటీ చేయాలని ఆశించారు. అయితే సమీకరణాల్లో అవకాశం దక్కలేదు. దీంతో లక్ష్మిని టీటీడీ సభ్యురాలిగా నియమించారు. మల్లెల రాజశేఖర్ గౌడ్ నంద్యాల లోక్‌సభ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. జడ్పీ ఛైర్మన్‌గా పనిచేశారు. రెండుసార్లు ఓర్వకల్లు నుంచి జడ్పీటీసీ సభ్యునిగా ఎన్నికయ్యారు. అంకితభావంతో పనిచేసే పార్టీ కార్యకర్తగా గుర్తింపు పొందారు.