Tsunami 2004 in AP :ప్రశాంత సాగర తీరంలో ఒక్కసారిగా అశాంతి! తాడెత్తున ఎగసిన కెరటాలు! రెప్పపాటులో ఈడ్చుకెళ్లిన రాకాసి అలలు! పుట్టకొకటి- చెట్టుకొకటి, నీటిలో ఇంకొకటి -నేలపై మరొకటిఇలా వెతికేకొద్దీ శవాలు వెళ్లేకొద్దీ విధ్వంసపు ఆనవాళ్లు! ఆహ్లాద తీరంలో ఆర్తనాదాలు! ఇదేమీ సినిమా స్క్రీన్‌ప్లే కాదు! 20 సంవత్సరాల క్రితం సునామీ సృష్టించిన విధ్వంసం! గుర్తు చేస్తేనే గంగపుత్రుల గుండెలదిరే ఉత్పాతం. ఇంతకీ ఆరోజు ఏం జరిగింది? కృష్ణాజిల్లాలో సునామీ బాధితులు కోలుకోడానికి ఎన్నేళ్లు పట్టింది?
2004 డిసెంబర్ 26! కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్! సమయం ఉదయం తొమ్మిదిన్నర గంటలు! తీరంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పర్యాటకుల కేరింతలు. అప్పుడే కడలి గర్భంలో కల్లోలం. అప్పటిదాకా సవ్వడి చేసిన అలలు, అంతలోనే తాడెత్తున లేచాయి. రెప్పమూసి తెరిచేలోగా, బీచ్ మొత్తం ఖాళీ. జల ప్రళయాన్ని కళ్లారా చూసిన కొందరు సముద్ర గర్భంలో కలిసిపోయారు. బతికి బట్టకట్టిన వాళ్లు ఇదిగో ఈ విధ్వంసానికి సాక్షులుగా మిగిలిపోయారు. 60 మందితో గుంటూరు నుంచి వచ్చిన లారీ, మరికొందరి యాత్రికులతో బీచ్‌కు వచ్చిన ఈ సుమో ఇలాంటివెన్నో నాటి సునామీ విధ్వంసానికి ఆనవాళ్లే.
2004 Indian Ocean Tsunami : గంగపుత్రులకు కడలి కల్లోలం కొత్తేమీకాదు. తుపాన్లు వచ్చిన ప్రతీసారి ఆటుపోట్లకు తట్టుకుని నిలబడతారు. కానీ ఆ రోజు మాత్రం మత్స్యకారులు ముందెన్నడూ చూడని రాకాసి అలల బీభత్సాన్ని చూసి భీతిల్లారు. అప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు ఏదో జరుగుతోందని అనుకున్నారేగానీ ఇంతటి విధ్వంసాన్ని మాత్రం ఊహించలేకపోయారు.
2004 డిసెంబర్ 26న ఉదయం 09:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకూ ఐదు సార్లు సముద్రం ఉప్పొంగింది. అరకిలోమీటర్ వెనక్కి వెళ్లిన సముద్రం అఖరుసారి మాత్రం ఒక్కఉదుటున విరుచుకుపడింది. 20, 30 అడుగుల ఎత్తున ఎగసిన కెరటాలు తీరప్రాంత గ్రామాలపైనా పంజా విసిరాయి. కొందరు ఎత్తైన భవనాల్లోకి వెళ్లి తలదాచుకోగా మరికొందరు కట్టుబట్టలతో బతుకుజీవుడా అంటూ బందరు వెళ్లిపోయారు. తిరిగొచ్చి చూస్తే మిగిలింది కన్నీళ్లే. అల్లకల్లోల ఆనవాళ్లే.