TSSPDCL React on KCR Tweet Power Cuts Mahabubnagar : మహబూబ్‌నగర్ జిల్లాలో తన పర్యటన సమయంలో కరెంట్ కోతలు ఉన్నాయన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ట్వీట్‌పై టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ స్పందించింది. ఆ రోజు ఎలాంటి విద్యుత్ అంతరాయం కలగలేదని స్పష్టం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.
KCR Tweet on Mahabubnagar Power Cuts : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రలో భాగంగా రెండురోజుల క్రితం మహబూబ్‌నగర్‌కు చేరుకున్నారు. అనంతరం అక్కడ జరిగిన కార్నర్ మీటింగ్‌లో పాల్గొని రాష్ట్రంలో కరెంట్ కోతలపై వ్యాఖ్యలు చేశారు. ఇవాళ వాటిని మళ్లీ గుర్తు చేస్తూ తన అధికార ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. అందులో తెలంగాణలో చాలా చిత్రవిచిత్రమైన ఘటనలు జరుగున్నాయని తెలిపారు. తాను గంట క్రితం మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనానికి వెళ్లారని పేర్కొన్నారు. వారు తినేటప్పుడు రెండు సార్లు కరెంట్ పోయిందన్నారు.
ప్రతి రోజు సీఎం, ఉప ముఖ్యమంత్రి పవర్ కట్ అవ్వలేదని ఊదరగొడుతున్నారని కేసీఆర్ విమర్శించారు. తనతో పాటు ఉన్న మాజీ ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో రోజుకు పదిసార్లు విద్యుత్ పోతుందని చెప్పిన విషయాన్ని ట్వీట్ ద్వారా ప్రజలకు తెలియజేశారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న హస్తం పార్టీ పరిపాలనా వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలని పేర్కొన్నారు.