RTC Karthika Masam Special Buses: కార్తిక మాసం అంటేనే శివ నామస్మరణతో మార్మోగే శైవక్షేత్రాలు గుర్తుకొస్తాయి. పవిత్ర మాసంగా భావించే ఈ నెల రోజలు భక్తులు ఉపవాస దీక్షలు, తీర్థ యాత్రలు చేస్తుంటారు. ప్రసిద్ధ ఆలయాలు వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులను నడిపేందుకు సిద్ధమైంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ డిపోల నుంచి సర్వీసులు నడిపించేందుకు ఆర్టీసీ సిద్దమైంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పంచారామాలు, తమిళనాడులోని అరుణాచలం, కేరళలోని శబరిమల క్షేత్రాలకు బస్సులు నడపనున్నట్లు తెలిపింది. మరోవైపు 40 మంది భక్తులు కలిసి ఏదైనా పుణ్యక్షేత్రం సందర్శన కోసం బస్సు కావాలన్నా బుక్ చేసుకోవచ్చని తెలిపింది.
మాలధారణ స్వాముల కోసం శబరిమలకు : ప్రతీ సంవత్సరం కార్తిక మాసంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వేల మంది భక్తులు అయ్యప్ప మాలధారణ వేసుకుంటారు. వీరి కోసం శబరిమల వెళ్లేందుకు ఆర్టీసీ అధికారులు బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. 40 మంది స్వాములు కలిసి బుక్ చేసుకుంటే బస్సు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ బస్సులో ఒక గురుస్వామి, ఒక కన్నె స్వామికి, ఒక వంట మనిషికి, స్వాముల సామగ్రిని సర్దేందుకు మరొకరికి ఉచిత ప్రయాణం కల్పిస్తారు. ఈ యాత్ర వివరాల కోసం డిపో మేనేజర్ 9959226047 నెంబరులో సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు.
అరుణాచలం యాత్ర :తమిళనాడు అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల కోసం ఈ నెల 13న మధ్యాహ్నం 3 గంటలకు హనుమకొండ బస్టాండ్ నుంచి బస్సు బయలుదేరనుంది. మార్గం మధ్యలో మొదట కాణిపాకం చేరుకుంటుంది. ఆ తర్వాత వరసిద్ధి వినాయకుడి దర్శనం అనంతరం అరుణాచలం చేరుకొని గిరి ప్రదక్షిణ చేస్తారు. అనంతరం తిరుగు ప్రయాణంలో జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని జోగులాంబ ఆలయం, బీచుపల్లిలోని ఆంజనేయస్వామి ఆలయాలను దర్శించుకొని ఆ తర్వాత హనుమకొండకు చేరుకునేలా యాత్రను నిర్ణయించారు. ఈ యాత్రకు వెళ్లేవారికి రూ.4500, పిల్లలకు రూ.3000గా టికెట్టు ధర నిర్ణయించారు. వివరాలకు 98663 73825 నెంబరులో సంప్రదించాలని సూచించారు.