Rabies Vaccines Troll Free Number :కుక్క, పాము కాటులకు గురైన వారికి సత్వర చికిత్స అందించే చర్యల్లో భాగంగా సమాచారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన 15400 టోల్ ఫ్రీ నంబర్‌కు బాధితులు సంప్రదిస్తే కుక్క కాటుకు వ్యాక్సిన్లు ఎక్కడ లభ్యమవుతాయో వెంటనే సమాధానం చెబుతారని తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్య ఈ కేంద్రం పనిచేస్తుందని పేర్కొంది. ప్రస్తుతానికి ఆంగ్లం, హిందీ భాషల్లో సమాధానం ఇస్తారని సర్కార్ వివరించింది. సోమవారం నుంచి తెలుగులోనూ సమాధానం ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశామని వెల్లడించింది.
పాము, కుక్క కాట్ల మరణాల్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రానికి అనుసంధానంగా విజయవాడలో దీనిని ఏర్పాటు చేశారు. 2030 నాటికి కుక్క కాటు వల్ల వచ్చే రేబిస్ వ్యాధిని నిర్మూలించాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు అనుగుణంగా ఇది దోహదపడనుంది. మనుషుల్లో నమోదైన రేబిస్ కేసులు 99 శాతం కుక్కతోనే వ్యాప్తి చెందింది. రేబిస్ వ్యాధితో ఏడాదికి 20,000ల మంది వరకు మరణిస్తున్నారు. 2023లో దేశవ్యాప్తంగా 30.43 లక్షల కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. అదే ఏపీలో 2023లో 2,12,246 మంది కుక్క కాటుకు గురయ్యారు.