Trial Run of First Ever Seaplane Service in Punnami Ghat Vijayawada :పర్యాటక రంగంలో మరో అద్భుతం ఆవిష్కరణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 9న విజయవాడ పున్నమిఘాట్ నుంచి శ్రీశైలం మధ్య ‘సీ ప్లేన్’ ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్నారు. డీ హవిల్లాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ సంస్థ రూపొందించిన 14 సీట్ల సీ ప్ల్లేన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారు.
జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి శ్రీశైలం జలాశయం వద్ద సీ ప్లేన్ ల్యాండింగ్ ప్రదేశాన్ని పరిశీలించారు. సీ ప్లేన్ అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈనెల 9న విజయవాడ పున్నమి ఘాట్ వద్ద నుంచి సీప్లేన్ ప్రారంభించి సీఎం చంద్రబాబు శ్రీశైలం వస్తారని చెప్పారు. శ్రీశైలం జలాశయం ఎస్ఎల్బీసీ టన్నెల్ పరిసర జలాల్లో సీ ప్లేన్ ల్యాండ్ అవుతుందన్నారు. సీ ప్లేన్ నుంచి సీఎం వచ్చిన తర్వాత రోప్ వే ద్వారా పైకి వచ్చి ఆలయానికి చేరుకుంటారన్నారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్న తర్వాత సీఎం సీప్లేన్లో విజయవాడ వెళ్తారని తెలిపారు.
విజయవాడ నుంచి శ్రీశైలం నుంచి విజయవాడ (Vijayawada to srisailam To Vijayawada) మధ్య సీ ప్లేన్ నడిపేందుకు అనుకూలతలపై నిర్వహించే ఈ ప్రయోగం విజయవంతమైతే రాబోయే రోజుల్లో రెగ్యులర్ సర్వీసు ప్రారంభించాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విశాఖ తీరం, నాగార్జునసాగర్, గోదావరి తదితర ప్రాంతాల్లోనూ సీ ప్లేన్ల ఏర్పాటుకు రెండోదశలో ప్రయోగాలు చేసే అవకాశాలున్నాయి. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని పర్యాటకంగా, సాంకేతికంగా అభివృద్ధి చేసేందుకు పలు కార్యక్రమాలు రూపొందిస్తోంది.