Vahan Website in AP : ఐదేళ్ల క్రితం వరకు వాహనదారులకు లైసెన్సుల జారీ సహా వాహనాల రిజిస్ట్రేషన్, మార్పుల కోసం దేశంలోని అన్ని రాష్ట్రాలూ వేర్వేరు వెబ్ సైట్లను రూపొందించి అమలు చేసేవి. రాష్ట్రానికి చెందిన వాహనాలు, వాహనదారుల డేటాను ఈ-ప్రగతి వెబ్‌సైట్‌లో రవాణాశాఖ అధికారులు నమోదు చేసేవారు. దేశవ్యాప్తంగా ఒకే వెబ్‌సైట్ లేకపోవడం వల్ల ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వాహనాల డేటాను అక్కడి అధికారులు తీసుకోవడం, తనిఖీ చేయడం కష్టతరమయ్యేది.
ఫిట్‌నెస్ ధ్రువపత్రాలు, ఆర్సీలు తదితర పత్రాలను ఆన్‌లైన్‌లో తనిఖీ చేసే అవకాశం లేకపోవడంతో, వాహనదారులపై అక్కడి అధికారులు వేధింపులకు పాల్పడేవారు. ఎడాపెడా జరిమానా విధించేవారు. ఈ సమస్యలపై వాహనదారుల ఆందోళనతో కేంద్రం, వాహనదారులందరికీ ఒకే వెబ్‌సైట్ రూపొందించి ఐదేళ్ల క్రితమే అమల్లోకి తెచ్చింది. అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధమైన సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఏకరూప లైసెన్సులు, ధ్రువపత్రాలు జారీ చేయాలని ఆదేశించింది. పరివాహన్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్‌సైట్‌లో అన్ని రాష్ట్రాలూ చేరాలని, ఈ వెబ్‌సైట్‌లోనే డేటా నిక్షిప్తం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
AP Govt on Vahan Website : ఏపీలోనూ 2020 నుంచి వాహన్ వెబ్‌సైట్ ద్వారానే రవాణా సేవలందించడం మొదలు పెట్టారు. ఈ-ప్రగతితో పోల్చితే వాహన్ వెబ్‌సైట్‌లో డేటా సురక్షితంగా ఉన్నా, నమోదు క్లిష్టతరంగా ఉంది. దీనిపై వాహనదారులు, సిబ్బందికి అవగాహన కల్పించి, శిక్షణ ఇచ్చి సమస్యను పరిష్కరించాల్సి ఉండగా, గత వైఎస్సార్సీపీ సర్కార్ పట్టించుకోలేదు. ఈ-ప్రగతి వెబ్‌సైట్‌నూ వినియోగించుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో వాహనాలు, లైసెన్సుల జారీని రెండు వెబ్సైట్లలోనూ నమోదు చేయడం, డేటా బదిలీ చేయడం సిబ్బందికి తలకు మించిన భారంగా మారింది.
రెండు వెబ్సైట్లలో డేటా నిర్వహణ క్లిష్టంగా మారి గందరగోళంగా మారింది. పైగా ఈ-ప్రగతి వెబ్‌సైట్‌కు సర్వీస్ ప్రొవైడర్‌గా ఉన్న ఓటీఎస్ఐ అనే సంస్థకు ఏకంగా రూ.18 కోట్ల బకాయి పెట్టిన వైఎస్సార్సీపీ సర్కార్, బకాయిల కోసం చెప్పులరిగేలా తిరిగినా చిల్లి గవ్వ ఇవ్వలేదు. దీంతో సదరు సంస్థ గత మే నెలలో అర్ధాంతరంగా సేవలు నిలిపివేసింది. దీంతో ఈ-ప్రగతి వెబ్‌సైట్ ఆగిపోయి రాష్ట్రవ్యాప్తంగా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. బకాయిలు ఇచ్చేందుకు నిధుల్లేని పరిస్ధితుల్లో ఉన్నతాధికారులు, సదరు సంస్థ ప్రతినిధులను వేడుకుని మరీ సేవలను పునరుద్ధరించాల్సి వచ్చింది.