Training of RO and ARO to conduct 2024 General Election: త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం అడుగులు వేస్తోంది. ఏపీలో ఇప్పటికే ఆయా జిల్లాల్లోని ఐఏఎస్, ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త ఓట్ల నమోదు, ఓట్ల అక్రమ తొలగింపుల్లో అక్రమాలకు పాల్పడిన వారిలో కొందరిపై కొరడా జులిపించింది. తాజాగా ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల విధుల్లో పాల్గొనే ఆర్ఓ, ఏఆర్ఓలకు శిక్షణ కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది. ఎన్నికల నిర్వాహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, కేంద్ర ఎన్నికల ఆదేశాలతో శిక్షణ శిభిరాలు నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు.
15ఏళ్లకు రూ.10వేల కోట్లు ఖర్చు- జమిలి ఎన్నికలపై ఈసీ అంచనా
ఆర్ఓ, ఏఆర్ఓలే కీలకం: రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో లోక్‌సభ, లోక్‌సభ పరిధిలోని శాసనసభ నియోజకవర్గ ఏఆర్ఓల తొలివిడత శిక్షణ కార్యక్రమం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా ఆధ్వర్యంలో జరిగాయి. విశాఖ ఏయూ కెమికల్ ఇంజినీరింగ్ బ్లాక్‌లో శిక్షణ కార్యక్రమాలు చేపట్టారు. జాతీయ స్థాయి మాస్టర్ ట్రైనీ సమీర్ అహ్మద్ జాన్, జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జునలతో కలిసి ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్నికల అధికారులకు పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని, అందుకోసమే ఈ శిక్షణ తరగతులు నిర్వహించినట్లు ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలు, ఓటర్ల జాబితా, ఎన్నికల అధికారులు ప్రధానమని ఈ ప్రక్రియ పూర్తయినట్లు మీనా వివరించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఆర్ఓలతో పాటు ఏఆర్ఓలు కీలకమని ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. గతంలో చాలా ఎన్నికలకు హాజరైనప్పటికీ, ఈ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా జారీచేసిన మార్గదర్శకాలు, సూచనలను తూచా తప్పక పాటిస్తూ ముందుకు వెళ్లాల్సి ఉందని తెలిపారు.