CM Jagan Siddam BUS Yatra:సీఎం వైఎస్ జగన్ సిద్ధం అన్న ప్రతిసారి ప్రజలు ట్రాఫిక్‌తో యుద్దం చేయాల్సి వస్తోంది. అన్న వస్తున్నాడంటే చాలు పచ్చగా ఉండే చెట్లు మోడువారిపోతాయి. ఆ చుట్టు పక్కల గ్రామాల్లో, విద్యుత్ కోతలతో చీకట్లు కమ్ముకుంటాయి. మందుబాబులు చిందులు తొక్కుతారు. అన్న గాలిలో వచ్చినా, నేలపై వచ్చినా జనజీవనం స్తంభించాల్సిందే. తాజాగా సీఎం జగన్ ఉభయ గోదావరి జిల్లాలో నిర్వహించిన సిద్ధం బస్సు యాత్ర Siddam BUS Yatra నేపథ్యంలో ప్రజలు ట్రాఫిక్ జాంతో ఇబ్బందులకు గురయ్యారు.
రెండు వైపులా వాహనాలను నిలిపివేత: సీఎం జగన్ ఎన్నికల ప్రచార బస్సు యాత్రతో ఉభయ గోదావరి జిల్లా ప్రజల తీవ్ర అవస్థలు పడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు, తేతలి నుంచి 16వ నంబరు జాతీయ రహదారి మీదుగా బయలుదేరి వై జంక్షన్, ఉండ్రాజవరం మీదగా రావులపాలెం వరకు సీఎం పర్యటన సందర్భంగా జాతీయ రహదారిపై రెండు వైపులా వాహనాలను నిలిపివేశారు. దీంతో వందలాది వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సిద్ధాంతం కూడలి నుంచి గోదావరి బ్రిడ్జి వరకు సైతం వాహనాలు నిలిచిపోయాయి. సీఎం వస్తున్నాడని అడుగడుగునా వాహనాలను ఆపివేయడంతో వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సీఎం కాన్వాయ్ వెళ్లిన తర్వాత వాహనాల రద్దీ తగ్గడానికి గంటకుపైగా సమయం పట్టడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాలను ఆపివేయడంతో వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
బస్సు యాత్ర సందర్భంగా రాజమహేంద్రవరంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. జగన్ పర్యటించే ప్రాంతాలైన బైపాస్ రోడ్డు, బాంపేట అజాద్ చౌక్, దేవిచౌక్ ప్రెస్ క్లబ్, తదితర ప్రాంతాల్లో విద్యుత్, ఇతర సర్వీస్ లైన్ల కేబుళ్లు ఎక్కడికక్కడ విచక్షణ రహితంగా కత్తిరించారు. వ్యాపార సముదాయాలను బలవంతంగా మూయించారు. అధికారుల తీరుతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రజలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.