CM Chandrababu Review on New Airports: రాష్ట్రంలో కొత్తగా మరో 7 విమానాశ్రయాలు రానున్నాయి. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఈ ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. విమానాశ్రాయాలను వీలైనంత త్వరగా అందుబాటులోకి తెస్తే రాష్ట్రాభివృద్ధికి ఉపయోగకరంగా ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ మేరకు ఎయిర్‌పోర్టుల విస్తరణ, నిర్మాణం, కొత్త విమానాశ్రాయాల కట్టడంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో పాటు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 7 విమానాశ్రయాలు ఉన్నాయి. విశాఖ, తిరుపతి, కడప, రాజమండ్రి, గన్నవరం విమానాశ్రయాలను ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. కర్నూల్ ఎయిర్‌పోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండగా పుట్టపర్తిలో ప్రైవేటు ఎయిర్ స్ట్రిప్ ఉంది. వీటికితోడు భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమవుతోంది. అయితే పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా మరో 7 ఎయిర్ పోర్టులు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని-అన్నవరం, ఒంగోలులో నూతన ఎయిర్‌పోర్టులను నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేసింది.
7 ప్రాంతాల్లో భూ సేకరణ పూర్తి:
- కుప్పం ఎయిర్‌పోర్ట్ ఫీజిబులిటీ రిపోర్ట్ సిద్ధం చేశారు. మొదటి దశలో 683 ఎకరాలు, రెండో దశలో 567 ఎకరాలు కలిపి మొత్తం 1,250 ఎకరాల స్థలాన్ని ఇప్పటికే గుర్తించారు. అయితే ఈ ప్రాంతానికి సమీపంలో ఐఏఎఫ్, హెట్ఏఎల్, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఉన్నందున ఎయిర్‌స్పేస్ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. దీనికి సంబంధిత వర్గాల నుంచి ఎన్వోసీ అవసరం ఉంటుంది.
- శ్రీకాకుళం ఎయిర్‌పోర్టు ఫీజిబులిటీ సర్వే పూర్తయింది. రెండు దశల్లో 1,383 ఎకరాల్లో నిర్మించేలా ప్లాన్ చేశారు. ఇప్పటికే భూసేకరణ మొదలైంది.
విద్యార్థుల్లో స్కిల్స్ పెంచడమే లక్ష్యం - ఇన్ఫోసిస్ సహకారంతో 'ఏపీ ల్యాబ్ ఆన్ వీల్స్'
- గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే దగదర్తి ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయగా 635 ఎకరాల భూసేకరణ కూడా పూర్తయింది. మరో 745 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఈ ప్రాంతంలో బీపీసీఎం రిఫైనరీ వస్తోంది. మరికొన్ని ఫ్యాక్టరీల రాకతో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని కార్గోకు, పరిశ్రమలకు ఉపయోగపడేలా ఎయిర్‌పోర్టు నిర్మించనున్నారు. శ్రీ సిటీ సెజ్‌లో ఎయిర్ స్ట్రిప్ట్ తెచ్చే అంశాన్నీ పరిశీలించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.
- ఒంగోలు విమానాశ్రయం కోసం 657 ఎకరాలు గుర్తించగా ఫీజిబులిటీపై అధ్యయనం చేయాల్సి ఉంది.
- పల్నాడు జిల్లా పరిధిలో నాగార్జునసాగర్ వద్ద 1,670 ఎకరాల్లో నిర్మాణానికి ప్రణాళిక రూపొందించగా మరో 500 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఈ భూమికి అటవీశాఖ క్లియరెన్స్ అవసరముంది.
- 1,123 ఎకరాల్లో తాడేపల్లిగూడెం ఎయిర్‌పోర్టు కట్టాలని నిర్ణయించారు. అయితే దీని సమీపంలోనే రాజమండ్రి, గన్నవరం విమానాశ్రాయాలు ఉన్నందున ఫీజిబులిటీని పరిశీస్తున్నారు.
- తుని-అన్నవరం మధ్య 757 ఎకరాల్లో ఎయిర్‌పోర్టు తేలవాలని ప్రతిపాదించారు. ఈ ప్రాంతంలో రైల్వే లైన్, హైవే, వాటర్ బాడీ ఉందని అధికారులు తెలిపారు.
- అనకాపల్లి జిల్లాలో కొత్త పరిశ్రమలు, నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ వస్తున్నందున అక్కడ ఎయిర్‌పోర్టు అవసరం ఉందని సీఎం అన్నారు. అనకాపల్లి, కాకినాడ, విశాఖలకు దగ్గరలో నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని నిర్దేశించారు.
- తాడిపత్రి ప్రాంతంలో ఒక ఎయిర్‌పోర్టుకు అవకాశం ఉందని దాన్ని కూడా పరిశీలించాలని సూచించారు.
అసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణాలు చేపట్టాలి: గన్నవరం విమానాశ్రయ విస్తరణ పనులపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. కూచిపూడి నృత్యం, అమరావతి స్థూపాల థీమ్‌తో టెర్మినల్ కొత్త డిజైన్లు సిద్దం చేశారు. జూన్ నాటికి పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. భోగాపురం విమానాశ్రయ పనుల పురోగతిని అధికారులు వివరించారు. ఏవియేషన్ యూనివర్సిటీ, ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో ఎయిర్‌పోర్టుల్లో ప్రైవేటు విమానాల పార్కింగ్ అవసరాలు పెరుగుతాయని ఆయా అసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణాలు చేపట్టాలని సీఎం సూచనలు చేశారు.
ఆలోగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి - అధికారులకు సీఎం చంద్రబాబు సూచన
పేర్ని నాని గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసు - దూకుడు పెంచిన పోలీసులు