ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాగర తీరాన సమస్యల కెరటాలు - కాకినాడ ఎన్టీఆర్​ బీచ్​లో వసతులు కరవు - NTR BEACH PARK IN KAKINADA

ఎన్టీఆర్‌ బీచ్‌ను పట్టి పీడుస్తున్న మౌలిక వసతుల కొరత-పర్యాటకులకు సరైన వసతులు లేక ఇబ్బందులు

NTR BEACH PARK IN KAKINADA
NTR BEACH PARK IN KAKINADA (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 4, 2025, 10:23 AM IST

NTR Beach Park In Kakinada: కాకినాడ తీరంలో పర్యాటకం పడకేసింది. గత వైఎస్సార్​సీపీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధి కుంటుపడింది. టీడీపీ హయాంలో ఏర్పాటైన ఎన్టీఆర్ బీచ్ పార్క్‌లో ప్రస్తుతం మౌలిక వసతుల కొరత వేధిస్తోంది. సందర్శకులకు ఆహ్లాదం, వినోదం పంచేందుకు ఏర్పాటు చేసిన ఉద్యానవనంలో లేజర్ షోలు అటకెక్కాయి. హరిత రిసార్ట్స్ పూర్తి కాకపోవడంతో పర్యాటకులు బస చేసేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. యుద్ధ విమానాల ప్రదర్శనశాల పనులు పూర్తైనా పునఃప్రారంభించలేదు. అలాగే సముద్ర స్నానాలు ఆచరించేవారికి కనీస వసతులు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది.

కొరవడిన మౌలిక వసతులు: కాకినాడ రూరల్​ మండలం వాకలపూడి ఎన్టీఆర్ బీచ్‌కి నిత్యం సందర్శకుల తాకిడి ఉంటుంది. ఆదివారం, పండుగ రోజుల్లో దాదాపు 5 వేల మంది వరకు ఇక్కడకు వస్తుంటారు. కుటుంబాలతో సహా అందరూ తరలి వచ్చి బీచ్​లో సరదాగా సేదతీరుతారు. బీచ్​కు సందర్శకుల తాకిడి ఉన్నప్పటికీ మౌలిక వసతుల కొరత మాత్రం పట్టిపీడిస్తోంది. సముద్రంలో స్నానాలు చేసిన వారు తడిచిన బట్టలతోనే ఇళ్లకు వెళ్లాల్సి వస్తోంది. కాసేపు కూర్చొని బీచ్ అందాలను వీక్షించేందుకు ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో పర్యాటకులు నిరాశ చెందుతున్నారు.

ఎన్టీఆర్ బీచ్ అభివృద్ధికి గతంలో టీడీపీ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. బీచ్ వద్ద అద్దాల వంతెన నిర్మించారు. ఏటా బీచ్ ఫెస్టివల్ నిర్వహించి వేల సంఖ్యలో సందర్శకులకు ఆహ్లాదం, వినోదం పంచారు. సుమారు 45 కోట్లతో బీచ్ పార్క్ ఏర్పాటు చేశారు. ఇందులో లేజర్ షో, వాటర్ ఫౌంటైన్, బబ్లులర్ ఫౌంటైన్ ఏర్పాటు చేయడంతో వివిధ రకాల మొక్కలు నాటారు. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో వీటి నిర్వహణను గాలికొదిలేయడంతో పార్క్ కళావిహీనంగా మారింది.

అందుబాటులోకి రాని హరిత రిసార్ట్స్: గత టీడీపీ ప్రభుత్వ పాలనలో బీచ్ పార్క్ ప్రాంగణంలోని హరిత రిసార్ట్స్ ఆధునికీకరణ పనులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. స్వదేశీ దర్శన్ పథకంలో భాగంగా 3 కోట్లతో రిసార్ట్స్ ను ఆధునీకరించాలని నిర్ణయించారు. అయితే పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతో కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇచ్చారు. దీంతో సమయం కావాలంటూ గుత్తేదారు కోర్టుకు వెళ్లడంతో 7 సంవత్సరాలుగా హరిత రిసార్ట్స్ పర్యాటకులకు అందుబాటులోకి రాకుండా పోయింది. ముళ్ల చెట్లు పెరిగి అటువైపు వెళ్లే దారికూడా మూసుకుపోయింది. బీచ్ పార్క్ వద్ద ఐనాక్స్ థియేటర్ తోపాటు షాపింగ్ మాల్స్ నిర్మించేందుకు వదిలేసిన ఖాళీ స్థలంలో ఇప్పుడు ముళ్ల చెట్లు పెరిగిపోయాయి.

వినోదంతోపాటు విజ్ఞానాన్ని అందించేందుకు బీచ్ లో కాకినాడ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో టీయూ 142 -ఎమ్​ యుద్ధ విమాన ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. దీనిని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దీనికి శ్రీకారం చుట్టారు. 9 కోట్ల 3 లక్షల రూపాయలతో చేపట్టిన ఈ ప్రదర్శనశాలకు వైఎస్సార్సీపీ నిధులు మంజూరు చేయకపోవడంతో పనులు పూర్తి కాలేదు. అయినప్పటికీ సార్వత్రిక ఎన్నికల ముందు హడావుడిగా ప్రారంభించేసి ఆ తర్వాత దీనిని మూసేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సైతం పనులు ఇంకా అందుబాటులోకి రాలేదు.


బస్సు సౌకర్యం కల్పించాలంటున్న సందర్శకులు: టీడీపీ ప్రభుత్వ హయాంలో బీచ్‌లో శిల్పారామం కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇక్కడ వాటర్ పార్క్ నిర్మాణం త్వరలోనే పూర్తికానుంది. ముఖ్యంగా కాకినాడ బీచ్ పార్క్ కు వచ్చే సందర్శకులను రవాణా సమస్య తీవ్రంగా వేధిస్తోంది. బైక్ లు, సొంత కార్లలోనే ఇక్కడకు రావాల్సి వస్తోంది. ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ సౌకర్యం ఏర్పాటు చేస్తే ఎంతో ప్రయోజనకంగా ఉంటుందని సందర్శకులు భావిస్తున్నారు.


''ఎన్టీఆర్ బీచ్ అభివృద్ధికి గతంలో టీడీపీ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. బీచ్ వద్ద అద్దాల వంతెన నిర్మించారు. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో వీటి నిర్వహణను గాలికొదిలేయడంతో పార్క్ పూర్తిగా పాడైపోయింది. ఇందులో లేజర్ షో, వాటర్ ఫౌంటైన్, బబ్లులర్ ఫౌంటైన్ ఏర్పాటు చేయడంతో వివిధ రకాల మొక్కలు నాటారు కానీ వాటి నిర్వహణ సరిగ్గా లేదు. ప్రభుత్వం స్పందించి బీచ్​కు ఆర్టీసీ సౌకర్యం ఏర్పాటు చేస్తే ఎంతో ప్రయోజనకంగా ఉంటుంది''- సందర్శకులు

భారీ పోలీసు బందోబస్తు మధ్య 'దివిస్‌' పనులు

కళకళలాడిన సాగర తీరం..జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన పర్యాటకులు

కాకినాడ బీచ్​లో సరదాగా కాసేపు

ABOUT THE AUTHOR

...view details