SADAREM CERTIFICATE VERIFICATION: బోగస్ సదరం (Software for Assessment of Disabled for Access Rehabilitation and Empowerment) సర్టిఫికెట్ల ప్రక్షాళన దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అర్హులైన వారికి పింఛన్లు అందజేసి, అనర్హులైన వారిపై వేటు వేసి కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దివ్యాంగుల పేరిట దొంగ సర్టిఫికెట్లు పొంది పింఛన్లు తీసుకుంటున్న వారి గురించి విచారణ చేపట్టింది.
ఉమ్మడి అనంతపురం జిల్లావ్యాప్తంగా 2 లక్షల 64 వేల మంది సామాజిక పింఛన్లు పొందుతున్నారు. వీరిలో 3 వేల 150 దీర్ఘకాలిక వ్యాధులకు గురై కదల్లేని స్థితిలో మంచానికే పరిమితమైనవారు ఉన్నారు. వీరికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి నెలా 5 వేల రూపాయల పింఛన్ ఇచ్చేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని 15 వేల రూపాయలకు పెంచింది. ఐతే వీరిలో కొంతమంది బోగస్‌లు ఉన్నట్లు తేలడంతో నకిలీల ఏరివేతకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అసలైన లబ్ధిదారులకు న్యాయం చేసేందుకు చర్యలు చేపట్టింది.
ప్రస్తుతం 6 వేల రూపాయలు పింఛన్ తీసుకుంటున్న దివ్యాంగుల ధ్రువపత్రాల పరిశీలన మొదలైంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 82 వేల 280 మంది దివ్యాంగులు పింఛన్లు తీసుకుంటున్నారు. వీరందరినీ రోజుకు వందమంది చొప్పున అనంతపురం సర్వజనాసుపత్రికి పిలిపించి సర్టిఫికెట్ల పరిశీలన చేస్తున్నారు. ఐతే ఆస్పత్రిలో కాలయాపన జరగడం వల్ల తీవ్ర అవస్థలు పడుతున్నామని దివ్యాంగుల బంధువులు చెబుతున్నారు. ఇళ్ల వద్దకే వచ్చి తనిఖీలు చేయాలని కోరుతున్నారు.
"అబ్బాయికి ఇంతకు ముందే సదరం సర్టిఫికెట్ తీసుకున్నాము. కానీ మళ్లీ ఇప్పుడు రమ్మని చెప్పారు. పిల్లాడు మంచానికే పరిమితమయ్యాడు. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. త్వరగా చూస్తే పిల్లాడిని తీసుకుని వెళ్లిపోతాము. మా పిల్లాడు 10 సంవత్సరాలుగా ఇలాగే ఉన్నాడు". - దివ్యాంగుడి తండ్రి
"సోమ, మంగళ, బుధ వారాల్లో 15 వేలు పింఛన్ అందుకుంటున్న వారిని రీవెరిఫికేషన్ చేస్తున్నాం. రోజుకి 30 నుంచి 40 మందిని ఒక వైద్యుడికి కేటాయించడం జరిగింది. ఇది ఫిబ్రవరి రెండో వారానికి పూర్తి కావొచ్చు. ఆ తరువాత 6వేలు పెన్షన్ తీసుకుంటున్న వారిని కూడా వెరిఫై చేయాలని మాకు ఆదేశాలు ఉన్నాయి. మా స్టాఫ్‌లో సగం మందిని ఈ వెరిఫికేషన్ కోసం కేటాయించడం జరిగింది. వీటిన్నింటినీ నేరుగా అప్లోడ్ చేసి ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది". - డాక్టర్ వెంకటేశ్వరరావు, సూపరింటెండెంట్
కొత్త పింఛన్లు మంజూరు చేసిన ప్రభుత్వం - ప్రతి నెల రూ.4వేలు
డెలివరీ బాయ్స్‌కు కేంద్రం గుడ్‌న్యూస్- ఇకపై గిగ్ వర్కర్లకు పింఛన్!