Illegal Sand Mining in P. Gannavaram in Konaseema District : ‘మా వెనక మంత్రి ఉన్నారు, పది నిమిషాల్లో ఇక్కడ ఎమ్మార్వో ఉండడు, వీఆర్వో ఉండడు’ అంటూ అక్రమార్కులు హెచ్చరించిన ప్రదేశం నుంచే అక్రమంగా వనరులు ఇంకా తరలిపోతున్నాయి. పట్టించుకోవలసిన అధికార యంత్రాంగం చోద్యం చూస్తోంది. కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం మానేపల్లి లంక భూముల్లోంచి అనుమతులు లేకుండా గోదావరి నదీపాయకు అడ్డుకట్టలు వేసి మరీ అక్రమంగా మట్టి, ఇసుక, తువ్వ ఇసుక తరలిస్తున్న వైనంపై ఇప్పటికే స్థానికులు ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే.
అధికారులను బెదిరించిన వారిపై పోలీసులు కేసు సైతం నమోదు చేశారు. అదే రోజున జిల్లా జేసీ టి. నిశాంతి, ఇతర అధికారుల బృందం ఈ లంక భూములను పరిశీలించింది. ఇక్కడి నుంచి వనరులు తరలించేందుకు అనుమతులు లేవు. ఇంత జరిగినా ఈ ప్రదేశం నుంచి అక్రమార్కులు పదుల సంఖ్యలో టిప్పర్లలో శనివారం రాత్రి నుంచి వనరులు తరలించటం మళ్లీ మొదలు పెట్టారు. ఆదివారం పగటిపూట కూడా ఇది సాగింది. విషయం కాస్తా విలేకరులకు తెలియటంతో అక్రమార్కులు ఆ ప్రదేశం నుంచి పొక్లెయిన్‌ను గోదావరి మధ్యలో ఉన్న లంక భూముల్లోని దుబ్బుల్లో దాచిపెట్టారు. టిప్పర్లు మాత్రం గోదావరి చెంతన లంక భూముల్లో ఉన్నాయి. కొన్ని టిప్పర్లలో రవాణా సైతం జరిగింది.
ఇంత బరితెగింపా : ఓవైపు ఉన్నతాధికారులు వచ్చి పరిశీలన చేసి ఇంకా నిర్ణయం వెల్లడించకముందే అక్రమార్కులు మానేపల్లి లంకభూముల్లోంచి ఇసుక, తువ్వఇసుక, లంకమట్టిని తరలిస్తున్న తీరు వారి బరితెగింపు ఏస్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. కొంతమంది అధికారులు అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారనే విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి.
పగటిపూట పొదల్లో - రాత్రికాగానే రేవుల్లో!
జాతీయ రహదారి పనుల కోసమట : ఈ వనరులు తరలిస్తున్న ప్రదేశంలో అక్రమార్కులు ఒక చెక్‌పోస్టులాంటిది ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ కొంతమంది నిర్వాహకులు, సిబ్బంది ఉన్నారు. మాకు జాతీయ రహదారి పనుల కోసం వనరులు తీసుకెళ్లడానికి అనుమతులు ఉన్నాయంటూ చెబుతున్నారు. జాతీయ రహదారి పనుల కోసమైనా వనరులు తవ్వేందుకు వివిధ శాఖలనుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాలి. ఎంతమేర వనరులు తీయాలో తెలుపుతూ అనుమతులు ఇవ్వాలి. ఇవేమీ లేకుండా తరలిస్తున్నా యంత్రాంగం తూతూమంత్రం చర్యలతో ప్రేక్షకపాత్ర వహిస్తోంది. అనుమతులు లేకుండా జరుగుతున్న వ్యవహారంపై అధికారులు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.
అనధికార రీచ్‌ల్లోకి వరుసకడుతున్న ట్రాక్టర్లు- అప్పుడూ ఇప్పుడూ అదే దందా!