Adilabad Tourist Places : పాఠశాలలో పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులకు దసరా పండుగ సెలవులొచ్చాయి. సెలవులంటే చాలు అందరికీ ఆనందమే. కొత్త ప్రదేశాల్లో సంతోషంగా గడుపుతూనే మరోవైపు మనకు దగ్గరలోని చారిత్రక ప్రాంతాలు, ఆలయాలను పర్యటిస్తే అనుభవాలు, జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించండి.
ఆదిలాబాద్ జిల్లాలో 1200 ఏళ్లనాటి సూర్యదేవాలయం : ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని 122 సంవత్సరాల కింద జైనులు నిర్మించారు. ప్రతి సంవత్సరం రెండు సార్లు సూర్యకిరణాలు స్వామి వారి పాదాలను తాకటం దీని ప్రత్యేకత. ఈ ఆలయం ఆదిలాబాద్ నుంచి 30 కి.మీ. దూరంలో ఉంటుంది.
కుంటాల జలపాతం :ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతాన్ని చూడడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వేలాది మంది పర్యాటకులు నిత్యం వస్తుంటారు. ఈ జలపాతం చుట్టూ దట్టమైన అడవిలో ఉన్నందున అటవీమార్గం గుండా జలపాతానికి చేరుకోవడం ఓ ప్రత్యేక అనుభూతి వస్తుంది.
పర్యాటకుల స్వర్గధామం పొచ్చెర : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని పొచ్చెర సమీపంలోని ఈ జలపాతం సందర్శకులను ఎంతో ఆకట్టుకుంటోంది. ఎత్తైన ప్రదేశం నుంచి నీరు కిందికి జాలువారుతాయి. దీన్ని వీక్షించడం గొప్ప దృశ్యంగా చెప్పుకోవచ్చు. బోథ్ జాతీయ రహదారి ఎక్స్ రోడ్ నుంచి 6 కి.మీ. దూరంలో ఉంది.
ఆసిఫాబాద్‌లో కుమురంభీం స్మారక మ్యూజియం : ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండలం జోడేఘాట్ వద్ద నిర్మించిన కుమురంభీం స్మారక మ్యూజియం ఎంతో ప్రముఖమైంది. జల్, జంగల్, జమీన్ నినాదంతో నిజాం రాజులతో పోరాడి తన ప్రాణాన్నే త్యాగం చేసిన కుమురంభీం పోరాట విశేషాలను తెలిపే మ్యూజియం ఇది. దీనికి దగ్గరలో ఉన్న కెరమెరి ఘాట్ రహదారిని చూడవచ్చు.
నిర్మల్ జిల్లా ఖ్యాతిని తెలిపే కొయ్యబొమ్మలు : అత్యంత పేరుపొందిన నిర్మల్ జిల్లా కేంద్రంలో తయారయ్యే కొయ్యబొమ్మలు వీక్షించాల్సిందే. తేలికపాటి పొనికి కర్రతో 400 సంవత్సరాల నుంచి తయారు చేస్తున్న ఈ బొమ్మలు సజీవంగా చూడ ముచ్చటగా కనిపిస్తాయి. అనంతరం ఇక్కడి నుంచి 15 కి.మీ. దూరంలో గోదావరి నదిపై ఉన్న శ్రీరాంసాగర్ జలాశయాన్ని చూడవచ్చు.
కడెం అందాల కనువిందు : నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో వాగుపై నిర్మించిన జలాశయం ఇది. దీని ద్వారా కడెం, దస్తూరాబాద్‌తో పాటు మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట, హాజీపూర్, జన్నారం, దండేపల్లి మండలాలకు సాగు నీరందిస్తున్న తీరును తెలుసుకోవచ్చు. బోటు ద్వారా జలాశయాన్ని చూడవచ్చు.