Tomato Price Hike In Telangana : టమాట ధర మళ్లీ ఒక్కసారిగా కొండెక్కింది. రెండు రోజుల క్రితం వరకు కిలో రూ.80 పలకగా శుక్రవారం రూ.100కు చేరింది. ఇరవై రోజుల క్రితం కిలో టమాట రూ.30 నుంచి రూ.40 పలకగా, ఐదు రోజుల క్రితం వరకూ రూ.60 చొప్పున అమ్మకాలు చేశారు. ప్రస్తుతం హోల్‌సేల్ వ్యాపారులు కిలో టమాట రూ.80కి విక్రయిస్తుంటే, రిటైల్ వ్యాపారులు రూ.100కు విక్రయిస్తున్నారు. డిమాండ్‌కు సరిపడా దిగుబడులు లేకపోవడం వల్లే ధరలు పెరిగాయని వ్యాపారులు భావిస్తున్నారు. ప్రతి ఏటా ధరల హెచ్చు తగ్గుదలతో టమాట తోటల సాగుపై రైతులు ఆసక్తి చూపకపోవడంతో పొరుగు రాష్ట్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.
వరదల కారణంగా ఒక్కసారిగా పెరిగిన ధరలు : నాలుగైదు నెలల క్రితం మెదక్, నిజామాబాద్ జిల్లాల నుంచి టమాట దిగుమతి చేసుకున్నారు. అయితే ఇటీవల వర్షాల వల్ల తోటలు దెబ్బ తినడంతో ఆయా ప్రాంతాల నుంచి దిగుమతి నిలిచిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లోని కల్యాణదుర్గం, మదనపల్లి తదితర ప్రాంతాల నుంచి వచ్చే టమాట పరిస్థితీ అంతే. ఇటీవల వరదలకు అక్కడి తోటలూ దెబ్బ తినడంతో అక్కడి హోల్‌సేల్ వ్యాపారులు ధరను ఒక్కసారిగా పెంచేశారు. ఏపీలో 22 కిలోల బాక్స్‌కు రూ.1,550 (కిలో రూ.70) చొప్పున అమ్ముతుండగా, రవాణా, ఇతర ఖర్చులతో కలిపి ఇక్కడి మార్కెట్‌లో హోల్‌సేల్‌గా రూ.80కు అమ్ముతున్నట్లు వ్యాపారులు అంటున్నారు. అదే రిటైల్ వ్యాపారులు మరో రూ.20 పెంచేసి వినియోగదారులకు అమ్ముతున్నారు. మొత్తంగా 20 రోజుల క్రితం రూ.30 నుంచి రూ.40 పలికిన టమాట ధరలు, ప్రస్తుతం కొండెక్కి రూ.100పై కూర్చున్నాయి.
నూనెలు కొనలేం! - పప్పులు తినలేం!! - పండుగల వేళ వంటింట్లో 'ధర'ల మంట - Essentials Price Increased