Tomato Prices Increase :కళతప్పిన పొలాలు కాసులు కురిపిస్తున్నాయి. దిగుబడులు పోటీపడి దిగొస్తున్నాయి. కుదేలైన కుటుంబాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఇంట్లో తిష్టవేసిన కష్టాలు గడపదాటుతున్నాయి. చుట్టూ పేరుకుపోయిన అప్పులు తీరిపోతున్నాయి. ఊహించని ధరలు ఆహ్వానిస్తున్నాయి. లాభాలతో జేబులు నిండుతున్నాయి. వర్షాల తర్వాత కోలుకున్న పంటలు రైతులకు కాసులు కురిపిస్తున్నాయి. దిగుబడులు మెండుగా ఉన్నాయి. లాభాలు మెరుగయ్యాయి. రైతుల మోములు ఆనందంతో కళకళలాడుతున్నాయి.
అన్నదాతలకు లాభాలు :కర్నూలు జిల్లాలో గత నెలలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో టమాటా పంట పూర్తిగా దెబ్బతింది. తర్వాత కోలుకున్న పంటలు రైతులకు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. దిగుబడులు మెండుగా వస్తుండటం, ధరలు సైతం అధికంగా ఉండటంతో అన్నదాతలకు లాభాలు దరిచేరుతున్నాయి. మరో వారం రోజుల్లో ఈ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. కిలో ధర రూ.200 లకు చేరినా ఆశ్చర్యం లేదని, ప్రస్తుతం హోల్‌సేల్‌గా మార్కెట్లో రూ.50 నుంచి రూ.60లకు ధర లభిస్తోందని చెబుతున్నారు. రిటెయిల్ మార్కెట్‌లో కిలో టమాటా రూ.100కు పైగా పలుకుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కోతలు, రవాణా తదితర ఖర్చులు పోను బాగానే మిగులుబాటు అవుతోందని, ఇది ఇలాగే కొనసాగితే మరింత ఆదాయం సమకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సాగు తగ్గింది కానీ ధర అదిరింది - టమోటా రైతుల్లో ఆనందం - Tomato Farmers Happy prices
తెలంగాణ మార్కెట్లకు టమాట :పత్తికొండ టమాటా మార్కెట్ నుంచి వ్యాపారులు కొనుగోలు చేస్తున్న టమాట దిగుబడులను రోజూ తెలంగాణలోని హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లోని మార్కెట్లకు తరలిస్తున్నారు. ఆ మార్కెట్లలో ఇక్కడి పంటకు మంచి గిరాకి ఉండడంతో కొనుగోలు చేసిన సరుకును ఏ రోజుకారోజు గ్రేడింగ్ చేసి లారీల్లో తరలిస్తున్నారు. అక్కడ హోల్‌సేల్‌గా రూ.100కు పైగా ధర పలుకుతుండడంతో ఆ మార్కెట్లకే సరుకును పంపుతున్నారు రైతులు.