Tirumala Board Member Inappropriate Behavior on TTD Employee:గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరుమలలో బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ టీటీడీ ఉద్యోగిపై బూతులతో విరుచుకుపడ్డారు. మహాద్వారం గేటు ద్వారా ఎవరినీ బయటకు పంపట్లేదని సమాధానం ఇచ్చినందుకు ఉద్యోగిపై పరుష పదజాలంతో ఆలయం ఎదుటే దూషించారు. బోర్డు సభ్యుడు అసభ్యంగా మాట్లాడడం చూసి అక్కడున్నవారంతా నిశ్చేష్టులయ్యారు. ఉద్యోగి మనోభావాలు దెబ్బతినేలా ఆయన ప్రవర్తించిన తీరును చూసి భక్తులు, సాటి ఉద్యోగులు ముక్కున వేలేసుకున్నారు.
ఉద్యోగితో బోర్డు సభ్యుడి సంభాషణ: ''నిన్ను ఇక్కడ పెట్టిందెవరు, ఏమనుకుంటున్నావు? ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా. ఏయ్ నువ్వు బయటకు పోవయ్యా, థర్డ్ క్లాస్ వ్యక్తులను ఇక్కడ ఎవరు ఉంచారు. వాడి పేరేంటి. నీకు ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా? నువ్వు బయటకు పో, ఏం మాట్లాడుతున్నావు''
టీటీడీ ఉద్యోగిపై బోర్డు సభ్యుడి బూతు పురాణం (ETV Bharat) కలియుగ దైవమైన వేంకటేశ్వరస్వామి ఆలయంలో బోర్డు సభ్యుడు భక్తిశ్రద్ధలతో ఉండకుండా బూతులు మాట్లాడటం ఏంటి అని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగులు, సిబ్బంది, భక్తులకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తే సంయమనం కోల్పోయి వీధిరౌడీలా దూషణలకు దిగి ఆ పదవికి ఉన్న గౌరవాన్ని మంటగలిపారని అంటున్నారు. ఏదైనా ఉంటే అధికారులకు ఫిర్యాదు చేయాలి తప్ప, ఇలా ఇష్టం వచ్చినట్లు ఉద్యోగులపై పెత్తనం ప్రదర్శించడం ఏంటని భక్తులు మండిపడుతున్నారు.
తిరుమల కల్తీ నెయ్యి కేసు - నిందితులకు ముగిసిన సిట్ విచారణ
ఇదీ జరిగింది:టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్‌కుమార్ మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తమవారితో కలిసి మహాద్వారం వద్దకు చేరుకున్నారు. బోర్డు సభ్యుడి సహాయకుడు గేటు తీయాలని ఉద్యోగి బాలాజీని కోరారు. మహాద్వారం గేటు ద్వారా ఎవరినీ పంపడం లేదని, అభ్యంతరం ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించాలని ఉద్యోగి సమాధానమిచ్చారు. దీంతో సహనం కోల్పోయిన బోర్డు సభ్యుడు నరేష్‌కుమార్ ఉద్యోగిపై అసభ్య దూషణకు దిగారు. ఇంతలో అక్కడకు చేరుకున్న టీటీడీ వీజీఓ సురేంద్ర, పోటు ఏఈఓ మునిరత్నం బోర్డు సభ్యుడు నరేష్ కుమార్‌కు సర్దిచెప్పి మహాద్వారం గేటు తీసి బయటకు పంపారు.
విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు: బోర్డు సభ్యుడు నరేష్‌కుమార్ అనుచిత ప్రవర్తనపై అధికారులు విచారణకు ఆదేశించారు. టీటీడీ ఉద్యోగి పట్ల నరేష్ తీరుపై ఉద్యోగుల్లో ఆగ్రహం నెలకొంది. ఉన్నతాధికారుల ఆదేశంతోనే మహాద్వారం గేట్లు తెరవకుండా ఉన్న ఉద్యోగి బాలాజీ సింగ్‌పై నరేష్ కుమార్ దుర్భాషలాడారు. ఈ మేరకు రంగంలోకి దిగన టీటీడీ విజిలెన్స్ విభాగం ఏం జరిగిందనే దానిపై విచారిస్తుంది. టీటీడీ బోర్డు సభ్యుడు రికార్డు చేసిన విజిలెన్స్ అధికారులు సీసీ కెమెరాల ఫుటేజ్‌ను కూడా పరిశీలిస్తున్నారు. విచారణ పూర్తయ్యాక ఆ వివరాలను ఉన్నతాధికారులకు పంపనున్నారు.
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్ - ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ - అర్ధరాత్రి వరకూ అక్కడే - అసలు ఏం జరిగింది?