Tiger Attacks in Telangana : తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి పులి పంజా విసిరింది. సిర్పూర్.టి మండలం దుబ్బగూడలో పొలంలో పని చేస్తున్న రైతుపై పులి దాడి (TIGER ATTACK ON FARMER) చేయడంతో అతని గాయపడ్డాడు. స్థానికుల కేకలు వేయడంతో పెద్దపులి పారిపోయింది. పులి దాడిలో సురేశ్ అనే వ్యక్తి గాయపడ్డారు. దీంతో అతనిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
భయపెడుతున్న వరుస దాడులు:కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి దాడులు స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. శుక్రవారం కాగజ్‌నగర్ మండలం గన్నారానికి చెందిన మోర్లే లక్ష్మీ అనే మహిళ పులిదాడిలో ప్రాణాలు కోల్పోయింది. వ్యవసాయ పనుల కోసం అని మరికొంత మందితో కలిసి పొలానికి వెళ్లిన లక్ష్మీపై పత్తి తీస్తుండగా వెనుకనుంచి పెద్దపులి దాడి చేసింది.
అధికారులపై స్థానికుల ఆగ్రహం: దీంతో పొలంలో పనిచేస్తున్న ఇతర కూలీలు అంతా భయాందోళనలకు గురై, అరుపులు, కేకలు వేయటంతో సమీప అటవీ ప్రాంతానికి పులి పారిపోయింది. అయితే పులి లక్ష్మీ మెడపై దాడి చేయడంతో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఆమె ఆస్పత్రిలో మరణించింది. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, పులి నుంచి తమను కాపాడాలంటూ స్థానికులు ఆందోళన సైతం చేపట్టారు. గత కొన్ని నెలలుగా పులుల సంచారం ఉందని తెలిసినా అటవీ అధికారులు పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.