తెలంగాణ

telangana

ETV Bharat / state

శిల్పారామంలో మూడో రోజు ఆకట్టుకున్న త్యాగరాజ ఆరాధనా సంగీతోత్సవాలు - THYAGARAJA ARADHANA MUSIC FESTIVAL

వరుసగా మూడో రోజు కొనసాగుతున్న త్యాగరాజ ఆరాధనా సంగీతోత్సవాలు - వీక్షకులను అలరించిన సంగీతనృత్యాలు - నృత్యరూపంలో త్యాగరాజ స్వామి రూపకపు అంతరార్థం ప్రదర్శన

Shilparamam in Hyderabad
Thyagaraja Aradhana Music Festival 2025 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 1, 2025, 5:37 PM IST

Thyagaraja Aradhana Music Festival 2025 : గాత్ర, వాద్య, నృత్య రూపాలలో అరుదైన త్యాగరాజ స్వామి కృతుల ప్రదర్శనలతో త్యాగరాజ ఆరాధనా సంగీతోత్సవాలు 2025 ఘనంగా జరుగుతున్నాయి. ఇది హైదరాబాద్‌లో 10వ సంగీతోత్సవాలు కావడం విశేషం. రోజురోజుకు కొత్తగా కర్ణాటక శాస్త్రీయ సంగీతజ్ఞులకి, సంగీతాభిమానులకు కన్నుల పండుగగా ఉత్సవాలు సాగుతున్నాయి. ఈరోజు సాయంత్రం గురు స్వప్న కృష్ణమోహన్ శిష్యులచే “నౌకాచరిత్రం” కూచిపూడి ప్రదర్శనతో ప్రారంభమైంది. ఈ త్యాగరాజ స్వామి రూపకపు అంతరార్థాన్ని వారు ఎంతో సొగసుగా నృత్యరూపంలో ప్రదర్శించారు.

ప్రధాన కచేరీగా విద్వాన్ సీవీపీ శాస్త్రి త్యాగరాజ కృతులని అత్యంత సుందరంగా ఆలపించారు. వీరికి విద్వాన్ కెఎల్‌ఎన్ మూర్తి వయోలిన్, విద్వాన్ ఎన్ఎస్ కల్యాణరామన్ మృదంగం, విద్వాన్ ఎస్‌ఏ ఫణిభూషణ్ ఘటం వాద్య సహాయ సహకారాలను అందించారు.

నృత్యకారులు (ETV Bharat)

ఆ తరువాత విద్వాన్ డీవీకే వాసుదేవన్, విద్వాన్ ద్రోనేంద్ర ఫణికుమార్‌లు వయోలిన్, వేణు వాయిద్యాలతో జంట కచేరీ కార్యక్రమం జరిగింది. వారి సాధికారిక ప్రదర్శనకు ప్రత్యక్షంగా వచ్చిన శ్రోతలకి, అంతర్జాలం ద్వారా వీక్షించిన వారికి కూడా త్యాగరాజ స్వామి కృతులలోని సౌందర్యం భావస్ఫోరకంగా ఆవిష్కరించింది. విద్వాన్ ఎన్ఎస్ కల్యాణరామన్ మృదంగం, విద్వాన్ ఎస్ఏ ఫణిభూషణ్ ఘటం పైన వాద్య సహకారం అందించారు.

సాంసృతిక రంగానికి తలమానికం హైదరాబాద్ : ఈ సంగీతోత్సవాలకు ముఖ్య ఆహ్వానితులైన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ సీఎస్ రంగరాజన్ కార్యక్రమంలో పాల్గొన్న విద్వాంసులను ఘనంగా సన్మానించారు. హైదరాబాద్ నగరం సాంస్కృతిక రంగానికి తలమానికంగా మారి, ఇంత విస్తృత స్థాయికి ఎదిగినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ సంగీతోత్సవాన్ని నిర్వహిస్తున్న సంస్కృతి ఫౌండేషన్ వారిని అభినందించారు.

రేపు గురుసన్మానం : హైదరాబాద్ త్యాగరాజ ఆరాధనా సంగీతోత్సవాల 10వ సంచిక ఫిబ్రవరి 2వ(ఆదివారం) తేదీన ఉదయం పంచరత్న సేవతో ప్రారంభమై, సాయంత్రం ప్రఖ్యాత విదుషీమణులు ప్రియా సిస్టర్స్ కచేరీతో ముగియనున్నాయి. ఈ సందర్భంగా సంస్కృతి ఫౌండేషన్ వారు ప్రసిద్ధ కర్ణాటక వయోలిన్ విద్వాంసులైన “నాదసుధార్ణవ” డా. అన్నవరపు రామస్వామికి గురుసన్మానం చేయనున్నారు.

శిల్పారామం వేదికగా హైదరాబాద్ త్యాగరాజ ఆరాధనా సంగీతోత్సవం - ఐదు రోజుల పండగ

ఘనంగా హైదరాబాద్ త్యాగరాజ ఆరాధనా సంగీతోత్సవం - ప్రేక్షకులను అలరించిన 'మనోమంథన' నృత్యరూపకం

ABOUT THE AUTHOR

...view details