Two Women Died due to Thunderbolt: దీపావళి పండగ వేళ విషాదం చోటు చేసుకుంది. అకాల వర్షంతో పాటు పిడుగు పడి బాణసంచా కేంద్రంలో ప్రమాదవశాత్తు నిప్పులు ఎగిసిపడి పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.
అకాలంగా కురిసిన వర్షం వర్షంతో పాటు పడిన పిడుగు ఇద్దరు మహిళలకు మరణశాసనం రాసింది. మరో ఐదుగురు ప్రాణాలతో కొట్టుమిట్టాడేలా చేసింది. తూర్పుగోదావరి జిల్లా మండలం పసలపూడి గ్రామ పరిధిలోని పొలాల మధ్య దీపావళి మందు గుండు సామాగ్రి తయారు చేసే కేంద్రం ఉంది. ఆ కేంద్రంలో ఒక పురుషుడు, ఆరుగురు మహిళలు పని చేస్తున్నారు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం సాయంత్రం సమయానికి భారీ వర్షంగా మారింది. వర్షంతో పాటు పిడుగు పడింది.
పిడుగు బాణసంచా తయారీ కేంద్రం పక్కనే ఉన్న కొబ్బరి చెట్టుపై పడింది. పిడుగు పడినప్పుడు నిప్పురవ్వలు ఎగిసిపడి తయారు చేస్తున్న బాణసంచాపై పడ్డాయి. ఈ క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని ఇద్దరు మహిళలు మృతి చెందగా మిగిలిన ఐదుగురు గాయపడ్డారు. మృతి చెందిన వారిలో బాణసంచా తయారీ కేంద్రం యజమాని శివ భార్య శ్రీవల్లి కూడా ఉన్నారు. గాయపడిన ఐదుగురిని తణుకులోని జిల్లా కేంద్ర ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
అక్కడ ప్రథమ చికిత్స అనంతరం ఉన్నత వైద్య సేవ నిమిత్తం ఏలూరులోని ఆశ్రమం హాస్పటల్‌కు తరలించారు. తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను బాధిత కుటుంబీకులను తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పరామర్శించారు. జిల్లా వైద్యాధికారితో మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.