Third Phase Rythu Bharosa Money Release :రాష్ట్రంలో రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం నిధుల పంపిణీ ప్రక్రియ సాగుతోంది. నేడు మూడు ఎకరాల విస్తీర్ణం వరకు సాగులో ఉన్న వ్యవసాయ పంట భూములు సంబంధించి రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేశారు. 9,54,422 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 1230.98 కోట్ల రూపాయలు జమ అవుతున్నాయి. అంతే కాకుండా 2 ఎకరాలలోపు విస్తీర్ణం రికార్డ్స్ అప్డేట్ చేసిన మరో 56,898 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 38.34 కోట్ల రూపాయలు కూడా జమ చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. దీంతో మూడు విడతల్లో కలిపి ఇప్పటికీ 44,82,265 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 58 లక్షల 13 వేల ఎకరాలకు 3487.82 కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యాయి.
వారికి త్వరలోనే జమ చేస్తాం :రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గత జనవరి 26వ తేదీన మండలంలో ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్టు కింద రైతు భరోసా పథకం నిధుల జమ ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3 విడతల్లో 3 ఎకరాల వరకు ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయడం జరిగిందని మంత్రి అన్నారు.