Theft Rampant in Flood Affected Areas of Vijayawada : విజయవాడలో వరదలతో తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో దొంగలు స్వైరవిహారం చేస్తున్నారు. వరద నీరు చుట్టుముట్టడంతో ప్రాణభయంతో ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే వరదల కారణంగా ఇళ్లలోని విలువైన సామగ్రి అంతా నీటిలో నాని, పాడైపోయిన బాధలో ఉన్న వారికి దొంగతనాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బీరువాల్లో దాచుకున్న నగదు, బంగారు ఆభరణాలను దోచుకుంటున్నారు. ఇంటి ముందు నిలిపిన వాహనాల నుంచి గ్యాస్ సిలిండర్ల వరకు కనిపించిందల్లా మాయం చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు.
దుకాణాల షట్టర్లను కూడా పగులగొట్టి లోపలున్న సామగ్రిని తీసుకుపోతున్నారని బాధితులు చెబుతున్నారు . తమ కుటుంబ సభ్యుల్ని సింగ్‌నగర్ వంతెన వద్ద సురక్షిత ప్రాంతంలో విడిచి వచ్చేలోపు ఇంట్లో నగదును మాయం చేశారని ఆ కుటుంబ పెద్ద కన్నీటి పర్యంతమయ్యారు. అజిత్‌సింగ్ నగర్, వాంబే కాలనీ, న్యూ రాజరాజేశ్వరీపేటలలో ఈ చోరీలు జరగడంతో బాధితులు లోబోదిబోమంటున్నారు.
ముగింపు దశకు చేరిన పునరుద్ధరణ పనులు - నేడు విజయవాడలో కేంద్ర వైద్య బృందం పర్యటన - Vijayawada Gradually Recovering
3 తులాల బంగారం పోయింది :ఆదివారం తమ ఇంట్లోకి వరద నీరు ప్రవేశించిందని వాంబేకాలనీ బీ బ్లాక్‌లో నివసిస్తున్న ముగతమ్మ, పక్కకే ఉన్న తమ కుమార్తె ఇంటికెళ్లారు. మంగళవారం తిరిగి తమ ఇంటికి వెళ్లి చూసేసరికి తాళం పగులగొట్టి ఉంది. 3 తులాల బంగారం దొంగతనం చేశారని, తాము కూలి పనులు చేసుకుని బతుకుతామని, ఇప్పటికే ఇంట్లోని సామానంతా నష్టపోయామని వృద్ధురాలు వాపోయారు.
గ్యాస్ సిలిండర్లనూ వదల్లేదు :ఇంట్లోకి నడుము లోతు నీరు రావటంతోవెంకటలక్ష్మణరావు కుటుంబం మంగళవారం సాయంత్రం తమ సోదరుడి ఇంటికెళ్లారు. భార్యను, పిల్లల్ని అక్కడ వదిలి, తెల్లారి వచ్చేలోపు ఇంటి తాళం పగులగొట్టి ఉందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. రూ. లక్ష నగదు, 15 కాసుల బంగారం, వెండి చోరీ చేశారని, గ్యాస్ సిలిండర్లను సైతం వదల్లేదని తెలిపారు. ఇప్పటికే రూ. లక్షకు పైగా దుకాణం సామగ్రి నీట మునిగింది. ఇంట్లో ఫర్నిచర్, ద్విచక్ర వాహనం పాడైపోయాయని పెరుమాళ్లు వెంకటలక్ష్మణరావు ఆవేదన వ్యక్తం చేశారు.
కేకలేస్తే పారిపోయారు :మంగళవారం రాత్రి 11 గంటలకు విద్యుత్ లేదు. ఇంటి పైనుంచి చూస్తుండగా కొందరు దొంగలు వచ్చారు. నడుము లోతు నీరున్నప్పటికీ వాహనాలను తోసుకుంటూ తీసుకెళ్తున్నారు. అర్ధరాత్రి వాహనాలను తీసుకెళ్లే అవసరం ఎవరికుంటుందని కేకలు వేశాం. అందరు మేల్కొని కిందికి వెళ్లే లోపు పారిపోయారు. అప్పటికీ పక్క కాలనీల్లో వాహనాలు, ఇతర సామాన్లను ఎత్తుకెళ్లారని మేస్త్రీ సుధాకర్ తెలిపారు.
రూ. 4 లక్షల సొత్తు ఎత్తుకెళ్లారు:వరదలతో మంగళవారం రాత్రి ఇంటికి తాళం వేసి వెళ్లాం. అప్పుడప్పుడు వచ్చి చూసుకున్నాం. ఆదివారం సాయంత్రం ఇంటికొచ్చాం. లోపల చూస్తే మూడు బీరువాలు పగలగొట్టి ఉన్నాయి. రూ. 1.6 లక్షల నగదు మాయం చేశారు. రెండున్నర తులాల బంగారం, 10 తులాల వెండి చోరీ చేశారు. సుమారు రూ. 4 లక్షల సొత్తు ఎత్తుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేశామని లూనా సెంటర్‌లోని బాధితురాలు విశాలాక్షి అసహనం వ్యక్తం చేశారు.
వరద నుంచి బయటపడుతున్న కాలనీలు - 7 వేల మంది పారిశుద్ధ్య కార్మికులతో క్లీనింగ్ - Vijayawada Gradually Recovering