Polamamba Jatara Special :అలవాట్లే ఆచారాలు, ఆచారాలే సంప్రదాయాలుగా మారుతుంటాయి. ఇప్పటికీ గ్రామాలు, పట్టణాల్లో జరిగే జాతరల వెనుక ఆసక్తికర నేపథ్యం ఉంటుంది. మహిమాన్విత వ్యక్తులే శక్తులుగా కొలువై భక్తకోటి పూజలు అందుకుంటుంటారు. పార్వతీపురం జిల్లా మక్కువ మండలంలోని శంబర గ్రామంలో జరిగే పోలమాంబ జాతరకూ ఎంతో ఆసక్తికరమైన చారిత్రక నేపథ్యం ఉంది.
భక్తుల కోర్కెలను తీర్చే పోలేశ్వరి పోలమాంబగా కొలువై పది వారాల పాటు పూజలు అందుకుంటోంది. శంబర గ్రామంలోని ఈ ఆలయంలో సంక్రాంతి తర్వాత వచ్చే రెండో మంగళవారం నుంచి పోలమాంబ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
పోలమాంబ అమ్మవారి విగ్రహం (ETV Bharat) శ్రీ పైడితల్లి సిరిమానోత్సవంలో కీలక ఘట్టం - సందడిగా అంకురార్పణ - Sri Paidithalli Sirimanotsavam
స్థల పురాణం
పూర్వం శంబర ప్రాంతాన్ని పరిపాలించే రాజులు చెరువును తవ్వాలని భావించి గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి రెండు ఎడ్లను పంపమని ఆదేశించారట. ఆ ఊళ్లో పోలమాంబ (పోలేశ్వరి) తండ్రి పేదరికంలో కొట్టుమిట్టాడుతూ ఎడ్లు కూడా లేని పరిస్థితిలో ఉన్నాడట. రాజాజ్ఞను ధిక్కరిస్తే శిక్ష పడుతుందనేది తండ్రి ఆందోళన. ఈ విషయాన్ని గమనించిన పోలమాంబ తన మహిమతో తెల్లారేసరికి 2 ఎడ్లు ఇంటిముందు ఉండేలా చేసిందట. అందరూ చూస్తుండగానే ఆ ఎడ్లు పెద్ద పులులుగా మారి చెరువును తవ్వేశాయట. వెంటనే పక్కనున్న కొండపైకి వెళ్లి రాళ్లుగా మారిపోవడంతో నాటి నుంచి గ్రామస్థులు వాటిని పులిరాళ్లుగా కొలిచి పూజిస్తున్నారు.
పోలమాంబ నేపథ్యం
యుక్తవయసు వచ్చిన పోలమాంబకు పెద్దలు పెళ్లి చెయ్యాలని భావించారు. కాగా, తాను గ్రామదేవతగా అవతరించానని, వివాహం చేసుకోనని చెప్పిందట. మేనత్త నచ్చజెప్పటంతో తాను చేసుకున్న వ్యక్తికి తన పేరు తెలియకూడదని, తనను తాకకూడదని షరతు పెట్టిందట. పెళ్లయిన మరుక్షణం నుంచి తనను పేరంటాలుగా కొలవాలనే షరతులతో పోలమాంబ పెళ్లికి అంగీకరించిందట. తనను చేసుకుంటున్న వ్యక్తి తాకిన పూల మాలను మేనత్తతో తెప్పించుకుని మెడలో వేసుకుని "పెళ్లి అయిపోయింది" అంది చెప్పిందట పోలమాంబ.
అత్తారింటికి వెళ్తూ అదృశ్యం
వివాహానంతరం భర్త గుర్రంపై ముందు వెళ్తుండగా, వెనుక పల్లకిలో పోలమాంబ అత్తారింటికి బయల్దేరగా ఊరి పొలిమేరలో పల్లకిని ఆపమని చెట్టు వెనక్కి వెళ్లిందట. ఎంతకూ తిరిగి రాకపోయేసరికి మేనత్త వెళ్లి చూడగా గొంతువరకు మట్టితో నిండిపోయి పోలమాంబ కనిపించిందట. అది చూసిన ఆమె తాను కూడా వచ్చేస్తాననడంతో సరే అని చెప్పి కొన్ని అక్షింతలు తీసుకుని మేనత్తకీ ప్రవేశం కల్పించిందట. ఈ విషయం తెలియక వెళ్లిపోయిన భర్త, ఊరి జనం వెతుకుతూ వెళ్లి చూడగా ఇద్దరి తలలు మాత్రమే కనిపించాయట. తాను గ్రామదేవతగా ఉంటానని, తన భర్తను మరో వివాహం చేసుకోమని చెప్పిందట. ఇక అప్పటి నుంచి ఆ ఊరి ఆడపడుచులు ఎక్కడున్నా ఈ జాతరకు గ్రామానికి పిలవటం తరాలుగా ఆనవాయితీ. జాతర ప్రారంభం రోజున ఊళ్లో 18 నుంచి 60 సంవత్సరాల మగవాళ్లంతా పెళ్లికొడుకులుగా తయారై ఉత్సవంలో పాల్గొంటారు. జాతరలో తొలి రోజు తోలేళ్లు, రెండోరోజు సిరిమానోత్సవం, చివరి రోజు అనుపోత్సవం జరిపిస్తారు. ఆ మూడు రోజుల్లో ప్రతి ఇంటి నుంచి వరి గింజలు తెచ్చి అమ్మవారిని పూజిస్తారు. వాటిని తిరిగి ఇళ్లలోని గింజలతో కలిపి పొలంలో చల్లుకుంటారు. అలా చేస్తే పంటలు బాగా పండుతుందని గ్రామస్థుల నమ్మకం. ఈ ఉత్సవానికి ఒడిశా, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడం విశేషం.
కన్నుల పండువగా పోలేరమ్మ జాతర - అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి - Venkatagiri Poleramma Jatara
వైభవంగా మోదకొండమ్మ జాతర మహోత్సవాలు - Modakondamma Thalli Jatara in Paderu