Hyderabad News Today : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వికారాబాద్ జిల్లా లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంది. ఫార్మా విలేజ్ కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లగచర్లలోని 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆగస్టు 1 వ తేదీన తెలంగాణ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
లగచర్లలో ఇదీ జరిగింది:లగచర్లలోఔషధ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి స్థలసేకరణ కోసం వికారాబాద్ జిల్లాలోని దుద్యాల మండలం దగ్గర ఉన్న లగచర్ల గ్రామంలోని నిర్వహించిన గ్రామసభ రణరంగాన్ని తలపించింది. స్వయానా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. భూసేకరణకు వ్యతిరేకంగా స్థానిక రైతులు గత కొంతకాలంగా నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజాభిప్రాయసేకరణకు గ్రామసభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా కలెక్టర్ సహా ముఖ్య అధికారులు అక్కడికి వెళ్లారు.
ఆ సమయంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ(కడా) ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిపై ఆయా గ్రామాల రైతులు కర్రలు, రాళ్లతో దాడులకు యత్నించారు. కలెక్టర్, అదనపు కలెక్టర్ త్రుటిలో తప్పించుకోగా కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ను తప్పించేందుకు యత్నించిన డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డిపైనా దాడి జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భారాస మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సహా పలువురిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. మరోవైపు ఈ ఘటనపై అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధం కొనసాగింది. ఈ పరిణామాల నేపథ్యంలో లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.