Man Cheating Gold Shop Owner in AP :షాపులో యజమాని దగ్గరగా ఎంతో నమ్మకంగా ఉంటున్నట్లు జీవించాడు. దీంతో ఆ బంగారు షాపు యజమానికి గుమాస్తాపై నమ్మకం ఏర్పడింది. ఓనర్ పని చెబితే ఆ పనిని సక్రమంగా చేసేవాడు. దీంతో యజమానికి ఇంకా ఆ గుమాస్తాపై విపరీతమైన నమ్మకం కలిగింది. ఇలా కొద్ది రోజులు చేసిన తర్వాత తనలోని అసలు మనిషి బయటకు వచ్చాడు. అదును చూసి ఆ సమయం ఎంతో ఓపిగ్గా ఉంటూ సమయం దొరగ్గానే పని కానిచ్చేశాడు. ఇంకా తన మీదికి నేరం రాకుండా ఉండేందుకు కట్టుకథ అల్లడానికి ప్రయత్నించాడు. కానీ చివరికి పోలీసుల రంగ ప్రవేశంతో మొత్తం విషయం బయటకు వచ్చింది. సినీ తరహాలో జరిగిన ఈ బంగారు దొంగతనం ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మహారాష్ట్రకు చెందిన వ్యక్తులు ఏపీలోని తాడేపల్లిగూడెం పట్టణంలో బంగారం శుద్ధి వ్యాపారం చేస్తుండేవారు. వీరి వద్ద అమర్ అనే వ్యక్తి పనిలో చేరాడు. తమ షాపులో బంగారం శుద్ధి చేసే యంత్రం పాడైపోవడంతో.. రాజమహేంద్రవరంలోని ఓ షాపులో శుద్ధి చేయించేందుకు యజమాని నిర్ణయించారు. గతంలో ఇలాంటి పనులను గుమాస్తా అమర్‌కు అప్పగిస్తే నమ్మకంగా వెళ్లి చేయించుకుని తీసుకువచ్చేవాడు. ఈసారి కూడా అదే నమ్మకంతో షాపు యజమాని అమర్‌తో 289 గ్రాముల బంగారం, రూ.6.30 లక్షల నగదును ఇచ్చి రాజమహేంద్రవరానికి పంపించారు. అప్పుడు అసలు కథ ప్రారంభమైంది.
ఎంతో నమ్మకంగా ఉన్న అమర్ అప్పటికే క్రికెట్ బెట్టింగ్, ఇతర వ్యసనాల కారణంగా అప్పుల పాలయ్యాడు. గతంలోనే బంగారం శుద్ధి చేయడానికి రాజమహేంద్రవరానికి వెళ్లినప్పుడు అమర్ మనసులో ఓ మాస్టర్ ప్లాన్ తట్టింది. ఆ బంగారాన్ని ఎలాగైనా కొట్టేసి తన అప్పులు తీర్చుకోవాలని పథకం వేశాడు. అయితే ప్లాన్ భాగంగా తానే బంగారం ఎత్తుకెళ్లిపోతే దొరికిపోతానని భావించి అలా దొరక్కుండా ఉండేందుకు ఏం చేయాలని ఆలోచించి దోపిడీకి పథకం రచించాడు.