Central Govt Funds For Expansion Of Roads In Srikakulam District:గత పాలకులు శ్రీకాకుళం జిల్లాలోని రహదారులకు కనీస మరమ్మతులు చేయకుండా కేవలం మాటలతో సరిపెట్టి ప్రజలను తీవ్ర అవస్థలకు గురిచేశారు. అయితే ప్రస్తుతం కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు కృషితో రహదారుల మరమ్మతులు చకచకా జరిగిపోతున్నాయి. కూటమి సర్కారు ఏర్పడిన ఏడు నెలల్లోనే జిల్లాలో 66.4 కిలోమీటర్ల రహదారి విస్తరణకు రూ.126 కోట్లు మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. టెండర్ల ప్రక్రియ ప్రారంభమైన 24నెలల్లో పనులు పూర్తి చేయాల్సిందిగా లక్ష్యాన్ని నిర్దేశించింది.
అంపురం టు ఘాటిముకుందపురం: నరసన్నపేట, టెక్కలి, కంచిలి మండలంలో అంపురం నుంచి ఘాటిముకుందపురం మధ్యలో 16 పంచాయతీల పరిధిలో 50 గ్రామాలున్నాయి. ఈ దారిలో ఐదు వంతెనలు ఉన్నాయి. గత పాలకులు వీటిని పట్టించుకోకపోవడంతో వంతెనలు సైతం కూలిపోయిన సందర్భాలు ఉన్నాయి. అప్పటి గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే రూ.11 కోట్లను కేటాయించారు. అనంతరం ప్రభుత్వం మారడంతో పనులన్నీ నిలిచిపోయాయి. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 11 కి.మీ. మేర విస్తరణకు అడుగులు పడ్డాయి. ఒడిశా రాష్ట్రానికి వెళ్లేందుకు ఈ దారే కీలకం కావడం గమనార్హం.
నౌపడ టు వెంకటాపురం:సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు రెండు మండల కేంద్రాల మధ్య నౌపడ-వెంకటాపురం రహదారి నిర్మాణాన్ని గత పాలకులు పూర్తిగా మాటలతో సరిపెట్టారు. మొత్తం 22 కిలోమీటర్ల రహదారిలో 60కిపైగా గ్రామాలున్నాయి. నిత్యం వేల మంది రాకపోకలు సాగిస్తుంటారు. ప్రస్తుతం ఇది ఒకే వరుస రహదారి కావడంతో ఇరుగ్గా ఉండి కేవలం ఒకే వాహనం వెళ్లాల్సిన దుస్థితి. ఈ మార్గం ఆర్టీసీకి ఎంతో ఆదాయాన్ని సమకూర్చుతోంది. కూటమి ఏర్పడిన తర్వాత ఈ రహదారి అభివృద్ధికి నిధులు మంజూరు చేయడంతో తీర ప్రాంత మత్స్యకారులు, ఉద్దానం రైతులకు వాణిజ్యపరంగా మేలు చేస్తోంది.
డోల-పొలాకి-నౌపడ మీదుగా: డోల నుంచి పోలాకి మీదుగా బూరభద్ర కూడలి నుంచి సంతబొమ్మాళి మండలం నౌపడ వరకు రహదారి విస్తరణకు నిధులు మంజూరు చేశారు. అప్పటి టీడీపీ హయాంలో కోటబొమ్మాళి నుంచి సంతబొమ్మాళి వరకు నౌపడ రోడ్డును రెండు వరుసల రోడ్డు కింద విస్తరించారు. అనంతరం వచ్చిన వైఎస్సార్సీపీ సర్కారు డీపీఎన్ రహదారిని ఐదేళ్లపాటు గాలికొదిలేసింది. మూలపేట పోర్టు నిర్మాణమవుతున్న తరుణంలో ఈ రహదారి పనులు కీలకంగా మారనున్నాయి. పరిశ్రమలు వచ్చేందుకు ఈ నిర్మాణం ఎంతో దోహదపడుతుంది.