Story On 11th Century Chalukya Temple : రాజులు పోయారు రాజ్యాలు పోయాయి. కానీ వారు నిర్మించిన కట్టడాలు మాత్రం చిరస్థాయిగా కొన్ని తరాల పాటు సజీవంగా ఉంటూ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. అలాంటిదే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఆలయం స్టోరీ. ఆ దేవస్థానాన్ని 11వ శతాబ్దంలో కల్యాణి చాళుక్యులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. దేవస్థానం మెుత్తం 16 కోణాలతో నక్షత్ర ఆకారంలో ఉండటం ఇక్కడ ప్రత్యేకత.
ఆలయ ముఖద్వారమైన మాలతోరణానికి ఉన్న ఆరు రంద్రాల నుంచి సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలో ఉన్న రామలింగంపై పడటం అద్భుత ఘట్టం. రామలింగేశ్వరునికి కావలిగా నందీశ్వరుడు ఉన్నాడని భక్తుల విశ్వాసం. పూర్వం "కిరియ కంది" గా పిలువబడే ఈ గ్రామం నందీశ్వరుడు కొలువుదీరడంతో నంది కంది అని పేరును మార్చుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
నక్షత్ర ఆకారపు దేవాలయం :సంగారెడ్డి జిల్లా సదాశివపేట పరిధిలోని నందికంది గ్రామంలో 11వ శతాబ్దంలో ఆనాటి కల్యాణి చాళుక్యులు నిర్మించిన నక్షత్ర ఆకారపు దేవస్థానం నేటికీ చెక్కు చెదరలేదు. ఇక్కడ అడుగడుగునా ఆధ్యాత్మికంతోపాటు సైన్స్‌కూడా తారసపడుతోంది. దేవస్థానం ముఖద్వారానికి ఆరు రంద్రాలతో మూలతోరణాన్ని నిర్మించారు. దీని ద్వారా గర్భగుడిలో ఉన్న లింగంపై నేరుగా సూర్యకిరణాలు పడుతున్నాయి. ఆనాటి కట్టడాలతో కూడిన రామలింగేశ్వర స్వామివారి దర్శనానికి హైదరాబాద్‌తోపాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు.