Tenali Woman Brain Dead Mystery in Guntur District :యువతిని కారులో ఎక్కించుకుని వెళ్లిన రౌడీషీటర్, గంటల వ్యవధిలోనే అపస్మారక స్థితిలో ఆమెను వైద్యశాలలో చేర్చిన సంఘటన గుంటూరు జిల్లా తెనాలిలో చోటుచేసుకుంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి పరారయ్యారు. సత్వరం స్పందించిన తెనాలి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.
గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని ఐతానగర్‌కు చెందిన మదిర సహానా (25) స్థానికంగా ఉన్న ఒక స్పీచ్ అండ్ హియరింగ్ థెరపీ కేంద్రంలో రిసెప్షనిస్టుగా పనిచేస్తుంది. రోజూ మాదిరిగానే శనివారం సాయంత్రం (అక్టోబర్ 19న) ఆమె ఇంటి వద్ద నుంచి తాను పనిచేసే చోటికి బయల్దేరింది. శనివారం రాత్రి 7 గంటల సమయంలో నవీన్ అనే యువకుడు సహానా ఫోన్ నుంచి ఆమె తల్లికి ఫోన్ చేశాడు. మీ అమ్మాయి సహానా కళ్లు తిరిగి పడిపోతే ప్రైవేటు వైద్యశాలలో చేర్చానని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆ హస్పిటల్‌కు వెళ్లారు. వారు వచ్చిన కొద్ది సేపటికే నవీన్ అక్కడి నుంచి పరారయ్యాడు.
గంటల వ్యవధిలోనే పట్టుబడ్డ నిందితుడు - బెడిసికొట్టిన వ్యూహాలు
నవీన్‌పై రౌడీషీట్ : కొల్లిపర మండలం వల్లభాపురానికి చెందిన నవీన్ 2016లో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడు. దీంతో అతనిపై రౌడీషీట్ నమోదు అయ్యింది. అతడు స్థానికంగా కోడి మాంస విక్రయ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. సహానా నివాసం ఉంటున్న ప్రాంతంలోనే నవీన్ బంధువులు ఉండంతో అప్పుడప్పుడు అక్కడికి వస్తూ వెళ్తూ ఉంటాడు. ఈ క్రమంలో వారి ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. వాళ్లిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. శనివారం (అక్టోబర్ 19న) తన పుట్టిన రోజు వేడుక ఉందని ఆమెను నవీన్ పిలించాడు. ఈ క్రమంలోనే స్థానిక ప్రకాశంబజార్ నుంచి ఆమెను కారులో ఎక్కించుకుని బయల్దేరాడు. మార్గ మధ్యలో తాను ఆకస్మికంగా బ్రేక్ వేయటంతో సహానా తల డ్యాష్ బోర్డుకు కొట్టుకుంది. ఈ సంఘటనతో ఆమె అస్వస్థతకు గురైంది. ఈ నేపథ్యంలోనే ఆమెను తాను వైద్యశాలలో చేర్చినట్లు పోలీసులకు వివరించాడు.