Temperature Drops in Tribal Villages :రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన చలితో జనాలు వణికిపోతున్నారు. మరో వైపు రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఆ ప్రాంత ప్రజలు ఇళ్లనుంచి బయటకు రాలేకపోతున్నారు. ఆదివారం రాత్రి అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో కనిష్ఠ ఉష్ణోగ్రత 4.1 డిగ్రీలుగా నమోదైంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఇదే అతి తక్కువ ఉష్ణోగ్రత.
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 16 ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలలోపే నమోదయ్యాయి. అరకులో 4.8, డుంబ్రిగుడలో 6, గూడెం కొత్తవీధిలో 7.3, హుకుంపేటలో 7.8 డిగ్రీలుగా నమోదయ్యాయి. పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు, శ్రీసత్యసాయి, అనకాపల్లి, అనంతపురం, నంద్యాల, చిత్తూరు, ఎన్టీఆర్, ప్రకాశం, పల్నాడు, అన్నమయ్య, ఏలూరు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకంటే తగ్గాయి.