Manchu Mohan Babu Wife Nirmala Letter: మంచు మోహన్‌బాబు ఫ్యామిలీ వివాదంపై ఆయన భార్య నిర్మల తొలిసారి స్పందించారు. శనివారం నాడు మంచు మనోజ్ ఇంట్లో విష్ణు గొడవ చేసినట్లు వస్తోన్న వార్తలపై ఆమె స్పష్టతనిచ్చారు. ఈ విషయంపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌కు నిర్మల లేఖ రాశారు. ఆ రోజు విష్ణు ఎవరితోనూ ఎలాంటి గొడవ చేయలేదని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఆ రోజు ఎలాంటి గొడవ చేయలేదు: డిసెంబర్ 14వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా మంచు విష్ణు జల్‌పల్లిలోని తమ ఇంటికి కేకు తీసుకొచ్చి సెలబ్రేట్ చేశాడని తెలిపారు. అయితే ఈ విషయంలో విష్ణుపై మంచు మనోజ్ అభాండాలు వేసి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసిందని అన్నారు. మంచు విష్ణు తన పుట్టినరోజు నాడు ఎలాంటి గొడవ చేయలేదని, ఇంటికి వచ్చి తన గదిలోని వస్తువులు తీసుకుని కొద్దిసేపు తనతో మాట్లాడి వెళ్లిపోయాడని లేఖలో పేర్కొన్నారు. ఈ ఇంటిపై మనోజ్‌కు ఎంత హక్కు ఉందో, పెద్ద కుమారుడు అయిన విష్ణుకి సైతం అంతే హక్కు ఉందని స్పష్టం చేశారు. విష్ణు తన పుట్టినరోజు నాడు మనుషులతో ఇంట్లోకి రాలేదని, మనోజ్ ఫిర్యాదులో ఎటువంటి నిజం లేదని వెల్లడించారు. ఈ ఇంట్లో పనిచేస్తున్న వాళ్లు సైతం మేమిక్కడ పని చేయలేమంటూ వాళ్లే మానేశారని, ఇందులో విష్ణు ప్రమేయం ఏమీ లేదని ఆ లేఖలో నిర్మల పేర్కొన్నారు.
మంచు మనోజ్ ఏం ఫిర్యాదు చేశాడంటే?: కాగా తన తల్లి పుట్టినరోజు సందర్భంగా శనివారం విష్ణు తన ఇంట్లోకి వచ్చి గొడవ చేసినట్లు మంచు మనోజ్ ఆదివారం ఓ ప్రెస్‌నోట్‌లో తెలిపారు. విష్ణు తన ఇంటి వద్ద జనరేటర్‌లో పంచదార పోయించారని, దీని కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో, భయభ్రాంతులకు గురి అయ్యామని ఆరోపించారు.
తాను సినిమా చిత్రీకరణలో ఉన్నానని, కుమారుడి స్కూల్‌లో ఈవెంట్‌కు తన భార్య హాజరైందని తెలిపారు. తమ అమ్మ పుట్టినరోజు సందర్భంగా కేకు ఇచ్చే నెపంతో, తన సోదరుడు విష్ణు, అతని అనుచరులు రాజ్ కొండూరు, కిరణ్, విజయ్ రెడ్డిలతోపాటు కొంతమంది బౌన్సర్లతో ఇంట్లోకి ప్రవేశించాడని పేర్కొన్నారు. ఈ సమయంలో జనరేటర్లలో షుగర్ పోయించాడని, దీని కారణంగా రాత్రి విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడిందని అన్నారు.
తామంతా ఆందోళనకు గురయ్యామని, ఇంట్లో అమ్మతో పాటు తొమ్మిది నెలల కుమార్తె, కుమారుడు, అత్తమామలు ఉన్నారని వెల్లడించారు. ఈ చర్యతో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం సైతం ఉందని అన్నారు. జనరేటర్‌కి దగ్గరలోనే వాహనాలు పార్క్ చేసి ఉన్నాయని, అక్కడే గ్యాస్ కనెక్షన్ సైతం ఉందని పేర్కొన్నారు. మంచు విష్ణు టీమ్ ఇంటి నుంచి వెళ్లిపోతూ తన వద్ద పనిచేసే వారిని అక్కడి నుంచి పంపించేశారని, తన కోచ్‌ను బెదిరించారని తెలిపారు. తమ అమ్మ పుట్టినరోజున ఇలా జరగడం ఎంతో బాధకు గురి చేసిందని, తాను, తన కుటుంబం భయంతో బతుకుతున్నామని అన్నారు. ఈ ఘటనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మనోజ్ అధికారులను కోరారు. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని మనోజ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
జనసేనలోకి ఎంట్రీ - మంచు మనోజ్ ఏం అన్నారంటే?
‘జనరేటర్‌లో పంచదార - నిలిచిన విద్యుత్ సరఫరా' - మంచు ఫ్యామిలీలో మళ్లీ గొడవ
హాలీవుడ్ స్టార్ యాక్టర్‌తో మంచు విష్ణు - ప్రారంభించనున్న కొత్త ప్రాజెక్ట్!