Telugu Student Dead in America Road Accident: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి మృతిచెందాడు. స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో అకస్మాత్తుగా వాతావరణంలో పెను మార్పులు సంభవించాయి. ఒక్కసారిగా పొగమంచు కమ్ముకోవటంతో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తెలుగు విద్యార్థి మృతి చెందగా ముగ్గురు యువకులు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం:బాపట్ల జిల్లా పర్చూరు మండలం బోడవాడకు చెందిన ఆచంట రేవంత్(22) బీటెక్ పూర్తి చేసుకుని ఉన్నత విద్య కోసం గతేడాది డిసెంబరు చివరిలో అమెరికా వెళ్లాడు. మాడిసన్ ప్రాంతంలోని డకోట స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుకుంటున్నాడు. భారత కాలమానం ప్రకారం స్నేహితులతో కలిసి రేవంత్ పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యేందుకు కారులో వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. కుమారుడి మరణ వార్తతో ఆ కుటుంబంతో పాటు బోడవాడలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. రేవంత్ తల్లి కొన్నాళ్ల క్రితం మరణించగా, అతడి తండ్రి ఆచంట రఘుబాబు ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్నారు.