Telangana Vice Chancellors Notification 2024 : తెలంగాణలోని విశ్వవిద్యాలయాలకు (Universities in Telangana) కొత్త ఉపకులపతుల నియామకానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పది యూనివర్సిటీలకు వీసీల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉస్మానియా, కాకతీయ, జేఎన్‌టీయూహెచ్, పాలమూరు, శాతవాహన, తెలంగాణ, తెలుగు, మహాత్మా గాంధీ, అంబేడ్కర్, జవహర్‌లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ ఆర్కిటెక్ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల పదవీకాలం మే 22న ముగియనుంది.
కొత్త వీసీల నియామకం కోసం అర్హులు దరఖాస్తులు సమర్పించాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ఫిబ్రవరి 12 సాయంత్రం 5 గంటల వరకూ బయోడేటాతో కూడిన దరఖాస్తు సమర్పించాలని పేర్కొన్నారు. అర్హతలు, విధివిధానాలు ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఉంటాయని బుర్రా వెంకటేశం వెల్లడించారు.
విశ్వవిద్యాలయాలు విశిష్ట నిలయాలుగా ఎదగాలి: గవర్నర్
అన్వేషణ కమిటీల ద్వారా ఎంపికలు :వైస్ ఛాన్స్‌లర్ల నియామకానికి ప్రొఫెసర్లుగా 10 సంవత్సరాల అనుభవం తప్పనిసరి. దానికితోడు నోటిఫికేషన్ నాటికి వయసు 65 ఏళ్లలోపు ఉండాలి. అందిన దరఖాస్తులను విద్యాశాఖ పరిశీలించి అర్హుల పేర్లను అన్వేషణ(సెర్చ్) కమిటీకి పంపుతుంది. ఆ కమిటీలో ముగ్గురు సభ్యులు యూజీసీ నామినీ, రాష్ట్ర ప్రభుత్వ నామినీ, వర్సిటీ నామినీ ఉంటారు. ఒక్కో విశ్వవిద్యాలయానికి మూడు పేర్లను సర్కార్‌కు వారు సిఫారసు చేస్తారు. వాటిని ముఖ్యమంత్రి ఆమోదంతో గవర్నర్‌కి పంపుతారు. అందులో ఒకరిని ఉపకులపతిగా నియమిస్తారు.
ఇక మిగిలేవి ఆర్జీకేయూటీ, మహిళా వర్సిటీలే :తెలంగాణ ఆవిర్భావం నుంచి బాసరలోని ఆర్జీకేయూటీకి వైస్ ఛాన్స్‌లర్‌ను (Vice Chancellors Notification) నియమించలేదు. మిగిలిన వాటికి గవర్నర్ కులపతి కాగా, బాసర ట్రిపుల్ ఐటీకి రాష్ట్ర ఆవిర్భావం దాకా అమెరికాలోని కార్నెగీ మెలన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ఆచార్యుడైన రాజిరెడ్డి ఛాన్స్‌లర్‌గా ఉన్నారు. ఆయన వైదొలిగిన తర్వాతి నుంచి కులపతి ఎవరూ లేరు. ఈ వర్సిటీకి వైస్ ఛాన్స్‌లర్‌ను నియమించాలంటే ముందుగా ఛాన్స్‌లర్‌ను నియమించడం తప్పనిసరి.