TSRTC Buy 1500 New Buses Soon : రవాణా రంగంలో వస్తోన్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ టీఎస్‌ఆర్టీసీ వినూత్న పద్ధతుల ద్వారా ప్రయాణికులకు చేరువవుతోంది. ఇందులో భాగంగానే ప్రయాణికుల సౌకర్యార్థం సుమారు 1500ల కొత్త బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు ఆర్టీసీలో కాలం చెల్లని బస్సులు పెరుగుతుండటంతో తరుచూ మొరాయిస్తున్నాయి.
TSRTC Buying New Buses 2024 :దీనికి తోడూ కాలం చెల్లిన బస్సుల నిర్వహణ వ్యయం కూడా పెరుగుతుంది. వీటి నుంచి వచ్చే పొగ వల్ల కాలుష్యమూ పెరుగుతోంది. పదిహేనేళ్ల జీవితకాలం దాటిన బస్సులను గ్రేటర్ హైదరాబాద్‌లో తిప్పేందుకు రవాణాశాఖ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఈ పరిణామాలు, సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ యాజమాన్యం వీటి స్థానంలో కొత్తవి ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. సుమారు 1500 బస్సుల కొనుగోలు చేసేందుకు ఆర్టీసీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు అవన్నీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌లే అని సమాచారం.
ఆదాయం పెంచుకోవడంపై టీఎస్‌ఆర్టీసీ ఫోకస్ - రోజుకు కోటి పెరిగేలా కార్యాచరణ! - TSRTC on Revenue
ఆర్థిక ఇబ్బందులతో ఆలస్యం :గడిచిన కొన్ని సంవత్సరాల్లో టీఎస్ఆర్టీసీకి వచ్చిన ఆదాయానికి, అయిన ఖర్చుకు భారీగా అంతరం ఉంది. ఒకవైపు ప్రయాణికులు తగ్గడం మరోవైపు వేతనాలు, డీజిల్ వ్యయం పెరగడం దీర్ఘకాలం జరిగిన సమ్మె వంటి అంశాలతో నష్టాలు భారీగా పెరిగాయి. వాటిని పూడ్చుకునేందుకు యాజమాన్యం కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. గతంలో వేతనాలూ ఆలస్యమయ్యేవి. ప్రస్తుతం ఒకటో తేదీకే వస్తున్నాయి. అయితే అప్పులు, కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు, పీఎఫ్, సీసీఎస్ చెల్లింపుల రూపంలో రూ.వేల కోట్ల ఆర్థికభారం అలాగే ఉంది. ఈ స్థితిలో ఎప్పటికప్పుడు కొత్త బస్సులు ప్రవేశపెట్టడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.