TGSRTC Door Delivery Cargo Services : కొన్నేళ్ల కిందటే టీజీఎస్ఆర్టీసీ సరకు రవాణా సేవలు ప్రారంభించి కార్గో సేవల ద్వారా మంచి ఆదాయాన్ని పొందుతోంది. ప్రభుత్వ రంగ కార్పొరేషన్ కావడం, విస్తృత నెట్‌వర్క్ ఉండటంతో దీనికి భారీగానే స్పందన వచ్చింది. ఈ సేవల్ని మరింత విస్తరించి ఏటా అదనంగా రూ. 300 కోట్లు ఆదాయం సంపాదించాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం అన్ని ప్రధాన పట్టణాలు, నగరాల్లో కార్గో బుకింగ్ కోసం ఆర్టీసీలో ప్రత్యేక వ్యవస్థ ఉంది.
పెద్ద మొత్తంలో బుకింగ్ ఉన్నప్పుడు వారి నుంచి నేరుగా సరుకులు తీసుకుని రవాణా చేస్తోంది. అయితే డెలివరీ మాత్రం హైదరాబాద్ లాంటి మహా నగరంలో జేబీఎస్, సీబీఎస్, ఉప్పల్ ప్రాంతాల్లో మాత్రమే ఉంది. మిగతా పట్టణాల్లో కేవలం బస్టాండ్‌లలో మాత్రమే డెలివరీ తీసుకోవాలి. దీనివల్ల చాలా మంది కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై దృష్టి సారించిన ఆర్టీసీ వినియోగదారుల చెంతకే వస్తువుల్ని డెలివరీ చేయాలని ప్రణాళికలు వేసింది. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే ఇంటి నుంచే పికప్ చేసుకోవాలని కూడా ఆలోచిస్తోంది.
పికప్ టూ హోం డెలివరీకి ప్రతిపాదనలు సిద్ధం :మొదట హైదరాబాద్ నగరంలో వెయ్యి చోట్ల ఈ సేవలు ప్రారంభించి ఫలితాల ఆధారంగా ఇతర ప్రాంతాల్లో ప్రారంభించాలని చూస్తోంది. ఆర్టీసీ ఎప్పటికప్పుడు ప్రతి పండుగలకు వినూత్న పద్ధతిలో సేవలను అందిస్తుంటుంది. ఈ రకంగానే ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. కార్గో సేవలు అందిస్తున్న డిపోల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.