Telangana Resident Died Road Accident in America: తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి వృత్తి రీత్యా అమెరికాలో స్థిరపడ్డాడు. బుధవారం తన భార్యతో కలిసి కారులో ప్రయాణిస్తున్న ఆ వ్యక్తి, వర్షం కారణంగా మరో కారును ఢీ కొట్టాడు. ఈ ప్రమాదం నుంచి దంపతులిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ప్రమాదం జరిగిన కారణంగా ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. ఈ క్రమంలో సాయం కోసం తన భార్యను కారులోనే ఉంచి తాను ఫోన్ చేయడానికి బయటకు వచ్చాడు. అంతలోనే మృత్యువు మరో కారు రూపంలో తరుముకొచ్చింది. వేరే కారు అతడిని ఢీ కొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లి, బంధువులు విషాదంలో మునిగిపోయారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన సాప్ట్వేర్ ఉద్యోగి అబ్బరాజు పృథ్వీరాజ్(30) అమెరికాలోని నార్త్ కరోలినాలో సాప్ట్వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. గత సంవత్సరం శ్రీ ప్రియను వివాహం చేసుకున్నాడు. బుధవారం రాత్రి తన భార్య శ్రీ ప్రియతో కలిసి కారులో వెళ్తుండగా వర్షం కారణంగా ముందున్న మరో కారును ఢీకొట్టారు. అది పల్టీలు కొట్టింది. తన కారులో ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తన భార్యను కారులోనే ఉంచి తాను బయటకి వచ్చాడు. అనంతరం జరిగిన ప్రమాద ఘటనపై పోలీసులకు ఫోన్ చేస్తుండగా, మరో కారు వేగంగా వచ్చి ఆయనను ఢీ కొట్టింది. దీంతో పృథ్వీరాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు.