Telangana Praja Palana Day Celebrations 2024 :తెలంగాణ ప్రాంతానికి నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించిన సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. జిల్లాల్లో మంత్రులు, ప్రభుత్వ ప్రతినిధులు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.
ప్రజా పాలనా దినోత్సవంగా గెజిట్ : తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవంగా సెప్టెంబరు 17వ తేదీని ప్రకటిస్తూ సోమవారం గెజిట్ జారీ చేసింది. 1948, సెప్టెంబరు 17న రాచరిక పాలన ముగిసి భారత సమాఖ్యలో భాగమై ప్రజాస్వామిక యుగంలోకి ప్రవేశించిన సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలనా దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు గెజిట్‌లో ప్రభుత్వం పేర్కొంది.
తెలంగాణ వియోచన దినోత్సవం పేరుతో కేంద్రం : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో అధికారికంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, గజేంద్రసింగ్ షెకావత్ హాజరుకానున్నారు. కిషన్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా బతుకమ్మ, బోనాలు, థింసా, డప్పు నృత్యాలు ఒగ్గుడోలు ప్రదర్శించనున్నారు.