CM Reavanth Express Condolences On Death Of Sitaram Yechury :సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణంపై మఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీతారాం ఏచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం ఏచూరి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. సీతారాం ఏచూరి చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తి దాయకమని అన్నారు.
సీతారాం ఏచూరి మరణం దేశ రాజకీయాలకు తీరని లోటని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లో అడుగుపెట్టిన ఏచూరి దాదాపు నాలుగు దశాబ్ధాలుగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారని ముఖ్యమంత్రి అన్నారు. రాజ్యసభ సభ్యుడిగా, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యునిగా, ఆర్థికవేత్తగా, సామాజిక కార్యకర్తగా ఏచూరి దేశంలో అందరికీ సుపరిచితుడయ్యారన్నారు. సీతారాం ఏచూరి లేని లోటు పూడ్చలేనిదని అన్నారు.
సంతాపం వ్యక్తం చేసిన కేసీఆర్ :సీతారాం ఏచూరి మృతి పట్ల కేసీఆర్ సంతాపం తెలిపారు. సామ్యవాద భావాలు కలిగిన నాయకుడు సీతారాం ఏచూరి అని ఆయన మరణం భారత కార్మిక లోకానికి తీరనిలోటని అన్నారు. ఆయన విద్యార్థి నాయకుడిగా, సీపీఎం కార్యదర్శిగా అంచెలంచెలుగా ఎదిగారని గుర్తుకు చేసుకున్నారు. ఏచూరి సీతారాం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు :ప్రముఖ సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి మరణించారనే వార్త తెలిసి చాలా బాధపడ్డానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. సీతారాం ఏచూరి ప్రియమైన మిత్రుడు, చాలా ప్రభావవంతమైన, స్పష్టమైన పార్లమెంటేరియన్ అని తెలిపారు. అద్భుతమైన ప్రజా వక్త అని స్పష్టం చేశారు. అతను వ్యతిరేక రాజకీయ భావజాలానికి ప్రాతినిధ్యం వహించినప్పటికీ మేము వ్యక్తిగత స్థాయిలో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నామన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, ఆయన పార్టీ కార్యకర్తలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని తెలిపారు.