Phone Tapping Case in Telangana High Court :రాష్ట్రవ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జడ్జిలు, వాళ్ల కుటుంబ సభ్యుల పేర్లు మీడియాలో ప్రసారం చేయొద్దని ధర్మాసనం ఆదేశించింది. కొన్ని పత్రికల్లో జడ్జి పేరు, మొబైల్ నంబర్ ప్రచురించినట్లు హైకోర్టు ప్రస్తావించింది. ఫోన్ ట్యాపింగ్‌పై మీడియా సంయమనం, బాధ్యతతో వ్యవహరించాలని తెలిపింది. ఫోన్ ట్యాపింగ్ కేసు వార్తలు రాసేటప్పుడు మీడియా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఈ కేసులో ఇప్పటికే ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేశారని అన్నారు. అందుకే ప్రస్తుతానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వాలనుకోవడం లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
వారి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి అనవసర రాద్ధాంతం చేయొద్దని హైకోర్టు హెచ్చరించింది. జడ్జీలు, వారి కుటుంబ సభ్యుల పేర్లు, ఫోన్ నంబర్లు, ఫొటోలు బహిర్గతం చేయొద్దని ఆదేశించింది. ఈ మేరకు ఈనెల 23న కౌంటర్ దాఖలు చేస్తామని కేంద్రం చెప్పింది. దీంతో కేసును ఈ నెల 23వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. ఈ కేసును సీజే ధర్మాసనం విచారిస్తోంది.
అసలేం జరిగింది : రాజకీయ నేతలతో పాటు జడ్జిల ఫోన్లు ట్యాప్ చేశారని పత్రికల్లో కథనాల ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ కేసును తెలంగాణ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఇప్పటికే ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. కేసు విచారణ జరుగుతోందని, నిందితులను అరెస్టు చేసినట్లు కౌంటర్లో ప్రభుత్వం పేర్కొంది. పలువురు పోలీసు అధికారుల ఫోన్లు సైతం ట్యాపింగ్ చేసినట్లు కౌంటర్ అఫిడవిట్లో తెలిపింది. ఇందుకు సంబంధించి హైకోర్టు నేడు విచారణ చేపట్టగా రాష్ట్ర ప్రభుత్వానికి సంయమనం పాటించాలని తెలిపింది. ఈ మేరకు ఈనెల 23కు కేసును వాయిదా వేసింది.