Telangana Govt Indiramma Housing Scheme Update : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల మొదటి విడత ఎంపిక ప్రక్రియను ఈ నెల చివరి వారంలో ప్రారంభించడానికి సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈ నెలాఖరున వీలుకాకపోతే డిసెంబరు మొదటి వారంలోనైనా జాబితా రూపొందించాలని అడుగులు వేస్తోంది. నిజానికి ఈ నెల 15 నుంచి 20 వరకు గ్రామసభలు ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇళ్ల తొలి జాబితా ఖరారు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొన్ని నిబంధనలపై స్పష్టత రాకపోవడం, కేంద్రం యాప్‌లోని అంశాలు రాష్ట్ర ప్రభుత్వ యాప్‌తో సరిపోలకపోవడంతో గ్రామసభల ఏర్పాటు ప్రక్రియ ముందుకు కదలకపోవడం. ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రానికి కేంద్రం వాటా అందాలంటే ఈ నిబంధనలపై స్పష్టత రావాలి. రాష్ట్రంలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే సైతం ఈ నెలాఖరులోగా పూర్తయ్యే అవకాశముంది. అనంతరం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు.
- రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో ఇళ్ల కోసం 80,54,554 దరఖాస్తులు అందగా, ఇందులో గతంలో గృహ లబ్ధిపొందిన కుటుంబాలు 12,72,019 ఉన్నాయని అధికారులు గుర్తించారు. లబ్ధిదారుల ఎంపికకకు ఆహార భద్రత కార్డును ప్రామాణికంగా తీసుకోబోమని, గ్రామ సభల ద్వారానే ఎంపిక చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
- లబ్ధిదారుల ఎంపికలో కీలక పాత్ర పోషించే ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు ఇప్పటికే పూర్తయింది. కేంద్ర ప్రభుత్వం సాఫ్ట్‌వేర్ గ్రామపంచాయతీ కార్యదర్శుల వివరాలను నమోదు చేశారు. వీరి ద్వారానే లబ్ధిదారుల వివరాలను కేంద్ర వెబ్‌సైట్‌లో నమోదు చేయడానికి ఉంటుంది.
- స్థలం ఉన్నవారికే మొదటి దశల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కనీసం 400 చదరవు అడుగుల విస్తీర్ణానికి తగ్గకుండా లబ్ధిదారు ఇంటిని నిర్మించుకోవాలి. దీనికి ప్రభుత్వం నాలుగు దశల్లో రూ.5 లక్షలు చెల్లిస్తోంది.
ఇందిరమ్మ ఇళ్ల కోసం వెయిట్ చేేసే వారికి గుడ్‌న్యూస్ - ఆ కార్డు లేకున్నా అప్లై చేసుకోవచ్చు
రాష్ట్రంలో ఐదేళ్లలో రూ.28 వేల కోట్లతో 20 లక్షలకుపైగా ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి విడతలో ఇందుకోసం రూ.7,740 కోట్లు ఖర్చు చేయనుంది. గరిష్ఠంగా 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. వచ్చే ఏడాది ప్రవేశపెట్టే బడ్జెట్‌లో స్థలం లేనివారికి కూడా ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అవసరమైతే ప్రభుత్వమే స్థలం సమకూర్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.