Heavy Rains in telangana Caused Heavy Property Damage :రాష్ట్రంలో వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. వరదలకు పలుచోట్ల రోడ్లు దెబ్బతిని దాదాపు 192 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 464 పంచాయితీరాజ్ రహదారులు 575 కిలోమీటర్ల మేరకు దెబ్బతినగా, సుమారు రూ.421 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఆ శాఖ అంచనా వేసింది. 1400 చోట్ల మిషన్ భగీరథ సరఫరా పైపులు దెబ్బతిని సుమారు రూ.80 కోట్ల మేర నష్టం కలిగింది. పలుచోట్ల నీటి సరఫరాకు అవసరమైన విద్యుత్ లేక 5,700 గ్రామాలకు సమస్యలు తలెత్తాయి.
వరదల ఉద్ధృతికి రాష్ట్రంలో 3,117 స్తంభాలు, 127 ట్రాన్స్‌ఫార్మర్లు, 18 సబ్‌స్టేషన్లు దెబ్బతిన్నట్లు ఆ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. నీటి పారుదల శాఖ పరిధిలో 260 చెరువులు, కాల్వలకు నష్టం వాటిల్లినట్లు ఆ శాఖ అధికారులు గుర్తించారు. ప్రాజెక్టుల కింద 64 కాలువలకు గండ్లు పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షం, వరదలకు పలుచోట్ల 21 మంది మృత్యువాతపడ్డారు.
అధికారులతో సీఎస్ సమావేశం : రాష్ట్రంలోని 11 జిల్లాల్లో నేడు వర్షాలు పడతాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన సర్కార్, ముందస్తు చర్యలపై కలెక్టర్లను, ఎస్పీలను ఆదేశించింది. సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్‌లు ఆయా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు కురిసే అవకాశమున్న ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్-మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపెల్లి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు.