ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇకపై విజయ నెయ్యితోనే ప్రసాదాల తయారీ - దేవాలయాలకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశం - Telangana Govt on Vijaya Dairy Ghee - TELANGANA GOVT ON VIJAYA DAIRY GHEE

Telangana Govt on Temples about Ghee: రాష్ట్రంలోని ఆలయాల్లో లడ్డూలు, ఇతర ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిని ఇకపై విజయ డెయిరీ నుంచే కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇన్నాళ్లూ అన్ని దేవాలయాలు ప్రైవేటుకే ప్రాధాన్యమివ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ప్రభుత్వ డెయిరీ నుంచి కొనుగోలు చేయాలని కోరినా ఒక్క ఆలయం కూడా కొనలేదని గుర్తించింది.

Telangana Government Order to use Vijaya Ghee
Telangana Government Order to use Vijaya Ghee (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 26, 2024, 12:55 PM IST

Telangana Government Order to use Vijaya Ghee :తెలంగాణరాష్ట్రంలోని అధిక శాతం ఆలయాల్లో లడ్డూలు, ఇతర ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిని ఇప్పటినుంచి ప్రైవేటు సంస్థల నుంచి కాకుండా ప్రభుత్వ సంస్థ అయిన విజయ డెయిరీ నుంచే కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఇన్నేళ్లు ప్రభుత్వరంగ సంస్థ నుంచి కాకుండా ప్రైవేటు కొనుగోళ్లకే దేవాలయాలు ప్రాధాన్యమిస్తున్నట్లు గుర్తించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు టెండర్లతో పని లేకుండా ఇకపై దేవాలయాల్లో విజయ నెయ్యినే వినియోగించాలని తాజాగా ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వ పాడిపరిశ్రమాభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలోని విజయ డెయిరీ ఉత్పత్తి చేసే నెయ్యిని పట్టించుకోకుండా ఆలయాల ప్రతినిధులు కమీషన్ల కోసం ప్రైవేటు సంస్థల వైపు మొగ్గుచూపినట్లు తెలిసింది.

తెలంగాణలో ప్రతి సంవత్సరం కోటి రూపాయలకు ఆదాయం వచ్చే ఆలయాలు 12 ఉండగా రూ. 50 లక్షల నుంచి రూ.కోటి ఆదాయం వస్తున్న దేవాలయాలు 24 ఉన్నాయి. రూ. 25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఆదాయం వచ్చే ఆలయాలు మరో 325 ఉన్నాయి. వీటిలో దాదాపు అన్నీ దేవాలయాల్లో లడ్డూ ప్రసాదం, నైవేద్యాలకు ప్రైవేటు సంస్థల నుంచే నెయ్యిని కొనుగోలు చేస్తున్నారు. పెద్ద ఆలయాల్లో దీనికి కోసం టెండర్లు పిలుస్తుండగా చిన్నవాటిలో అధికారులు నేరుగా సంస్థల నుంచే కొంటున్నట్లు తేలింది. ప్రభుత్వరంగంలోని సంస్థ అయిన విజయ డెయిరీ నాణ్యతకు అధిక ప్రాధాన్యమిస్తున్నా ఆలయాలు మాత్రం ఈ సంస్థను పట్టించుకోకుండా ప్రైవేటు కంపెనీలకు ప్రాధాన్యమిస్తున్నాయి. దీంతో విజయ డెయిరీకి సంబంధించిన నెయ్యి కొనుగోళ్లు ఈ ఏడాది ఆరంభం నుంచి మందగించాయి.

కల్తీ నెయ్యిలో లేదు - ఆవులోనే ఏదో జరిగిందండీ: తమ్మినేని వివాదాస్పద వ్యాఖ్యలు - Tammineni Sitaram on Tirupati laddu

తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో : గతంలో ముంబయి సంస్థలు కొనుగోలు చేసినా ప్రస్తుతం మానేయడంతో 50 టన్నులకు పైగా నెయ్యి డెయిరీ వద్ద పేరుకుపోయింది. ఈ నిల్వలు ఇలా ఎక్కువ రోజులుంటే నాణ్యత దెబ్బతింటుందని అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో విజయ డెయిరీ ఎండీ లక్ష్మి తమ సంస్థ వద్ద నెయ్యిని కొనుగోలు చేయాలని మార్చి 15న, జూన్‌ 1న దేవాదాయశాఖకు, రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు లేఖలు రాశారు. ప్రభుత్వరంగ సంస్థను ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరారు. అయినా దీనిపై ఎలాంటి స్పందనా రాలేదు.

తాజాగా తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో విజయ డెయిరీ ఉన్నతాధికారులు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌ను కలిసి పరిస్థితిని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన విజయ నెయ్యిని దేవాలయాలు వినియోగించుకోవడం లేదని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై దేవాదాయశాఖ ఆరా తీయగా రాష్ట్రంలోని దేవాలయాల్లో ఒక్కటి కూడా విజయ డెయిరీ నెయ్యిని కొనుగోలు చేయడం లేదని తేలింది. కొన్ని ఆలయాలు జిల్లా డెయిరీల పేరిట ప్రైవేటు సంస్థల నుంచి తీసుకుంటున్నట్లు గుర్తించింది. కొన్నిచోట్ల అక్రమాలు కూడా చోటుచేసుకున్నట్లు ప్రభుత్వ పరిశీలనలో వెల్లడైంది.

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం - ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌పై కేసు - Case File on AR Foods

ముందుకొచ్చిన 5 ఆలయాలు :గతంలో బాసర ఆలయానికి సంబంధించి సంబంధించి ఒక అధికారి రూ. 5 కోట్ల మేరకు అవినీతికి పాల్పడి అవినీతి నిరోధకశాఖ అధికారులకు దొరికినట్లు తెలిసింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం, రాష్ట్రవ్యాప్తంగా అన్నీ ఆలయాల్లో విజయ డెయిరీ ద్వారానే నెయ్యి కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు సంస్థల నుంచి తీసుకున్నట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. తాజా పరిణామాలతో ప్రభుత్వ రంగసంస్థ అయిన విజయ నెయ్యిని కొనుగోలు చేసేందుకు రాష్ట్రంలోని 5 దేవాలయాలు ముందుకొచ్చాయి.

వేములవాడ దేవస్థానం పదివేల కిలోలు, బాసర 1500 కిలోల నెయ్యి, వరంగల్​ భద్రకాళి దేవాలయం 1,050 కిలోలు, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయం 980 కిలోలు, మంచిర్యాల వేంకటేశ్వరస్వామి దేవాలయం 105 కిలోగ్రాముల నెయ్యి కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చాయి. వీటిని సరఫరా చేసేందుకు విజయ డెయిరీ సన్నాహాలు చేస్తోందని పశుసంవర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్‌ చెప్పారు. మిగిలిన ఆలయాలు నుంచి ఆర్డర్లు వస్తాయని ఆయన తెలిపారు.

శ్రీవారి లడ్డూలో నెయ్యితో పాటు మరెన్నో పదార్థాలు కల్తీ! - విజిలెన్స్‌ విచారణలో విస్తుపోయే అంశాలు - Srivari Prasadam Controversy

ABOUT THE AUTHOR

...view details