Indiramma Houses Grievance Website : ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మరింత పారదర్శకంగా అమలుచేసే లక్ష్యంతో ఫిర్యాదుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందించింది. ఈ మేరకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించిన గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో సమస్యలు తలెత్తితే వెంటనేindirammaindlu.telangana.gov.inవెబ్సైట్లో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
మొబైల్‌కు ఎస్‌ఎంఎస్ : ఫిర్యాదుపై స్పందన, తీసుకున్న చర్యలను మొబైల్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం వస్తుందని తెలిపారు. గ్రామాల్లో ఎంపీడీవో, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్ ద్వారా సంబంధిత అధికారులకు ఫిర్యాదు వెళ్తుందని వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్న మంత్రి మధ్యవర్తులకు తావులేకుండా అర్హులకే దక్కేలా పారదర్శకంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
95శాతం దరఖాస్తుల పరిశీలన పూర్తి : వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణం ప్రారంభించేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన జిల్లాల్లో 95శాతం, జీహెచ్ఎంసీలో 88శాతం పూర్తైనట్లు వెల్లడించారు. త్వరలో లబ్దిదారుల ఎంపిక పూర్తి చేసి నిర్మాణానికి అవసరమైన కార్యాచరణపై దృష్టి సారించాలని అధికారులకు తెలిపారు.