Telangana Govt will be Regularize Sadabainama Lands : లిఖితపూర్వక ఒప్పందంతో భూములు కొనుగోలు చేసిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వ శుభవార్త చెప్పింది. జూన్ 2, 2014 నాటికి తెల్లకాగితాలపై ఒప్పందాల(సాదాబైనామా) ద్వారా జరిగిన కొనుగోళ్లను క్రమబద్ధీకరించాలని ఆర్‌ఓఆర్-2024 చట్టం సెక్షన్ 6(1) కింద నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్డీవో స్థాయిలో విచారిణ చేపట్టిన తర్వాత క్రమబద్ధీకరణ చేయనుంది. ఎన్నో ఏళ్ల క్రితం సాదాబైనామా రూపంలో భూములు కొని అనుభవిస్తున్నా సరైన పత్రాలు లేకపోవటంతో రాష్ట్ర ప్రభుత్వం వారిని రైతులుగా గుర్తించడం లేదు. అయితే వీటిని క్రమబద్ధీకరించటం కోసం గత ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించినా వాటిని పరిష్కరించటంలో విఫలమైంది.
తాజాగా ప్రస్తుత ప్రభుత్వం కొత్త ఆర్‌ఓఆర్ చట్టం ద్వారా సాదాబైనామాలకు భూహక్కులు వర్తింపజేస్తామని వెల్లడించడంతో దరఖాస్తుదారుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. గత ప్రభుత్వమే సాదాబైనామాలను క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జూన్ 2వ తేదీ 2014లో లిఖితపూర్వక ఒప్పందంతో భూములు కొన్న రైతుల దరఖాస్తులకు చట్టబద్ధత కల్పించి పాసుపుస్తకాలు జారీచేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 2020లో ప్రకటన వెలువరించి నవంబర్ 10 వరకు దరఖాస్తులు స్వీకరించింది.
ధరణితో పెరిగిన సాదాబైనామా భూముల సమస్యలు : దరఖాస్తులు స్వీకరించినా నాలుగేళ్లుగా వాటికి పరిష్కారం లభించలేదు. తాజాగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సాదాబైనామా భూములు ఉన్న రైతులకు భూహక్కులు లభించే అవకాశం ఉంది. ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా కొనుగోలు చేసిన భూముల క్రమబద్ధీకరణలో తలెత్తుతున్న అడ్డుంకులను తొలగించటంతోపాటు వీటి పరిష్కారానికి భూ- భారతిలో ప్రత్యేక ఆప్షన్ తీసుకువస్తే మార్గం సులువుతుందని నిపుణులు భావిస్తున్నారు.