ఆ 10 వర్సిటీలకు ఇంఛార్జీ వీసీలను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం - Incharge VCs to 10 Universities - INCHARGE VCS TO 10 UNIVERSITIES
Incharge VCs to Universities : రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను ఇంఛార్జీ వీసీలుగా ప్రభుత్వం నియమించింది. నేటితో ఈ వీసీల పదవీ కాలం ముగియనున్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం శాశ్వత వీసీల నియామకాల ప్రక్రియ కొనసాగుతుండగా, ఆ ప్రక్రియ పూర్తి కానున్న జూన్ 15 వరకు ఇంఛార్జీ వీసీలు కొనసాగుతారు.
Incharge VCs to Universities in Telangana : రాష్ట్రంలోని 10 విశ్వ విద్యాలయాలకు ఇంఛార్జీ వీసీలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉస్మానియా, జేఎన్టీయూ సహా 10 వర్సిటీల వీసీల పదవీ కాలం నేటితో ముగియటంతో సర్కారు ఈ మేరకు నిర్ణయించింది. సీనియర్ ఐఏఎస్‌లను ఇంఛార్జీ వీసీలుగా నియమించింది. ఉస్మానియా వర్సిటీకి దాన కిశోర్, జేఎన్టీయూ హైదరాబాద్‌కు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, కాకతీయ వర్సిటీకి వాకాటి కరుణ, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి రిజ్వీ, తెలంగాణ యూనివర్సిటీకి సందీప్ సుల్తానియా, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి శైలజా రామయ్యర్, మహాత్మా గాంధీ యూనివర్సిటీకి నవీన్ మిత్తల్, శాతవాహన వర్సిటీకి సురేంద్ర మోహన్, జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్‌కు జయేశ్ రంజన్, పాలమూరు వర్సిటీకి నదీం అహ్మద్‌లను ఇంఛార్జీ వీసీలుగా నియమించింది.
అయితే తెలంగాణ యూనివర్సిటీకి ఇప్పటికే బుర్రా వెంకటేశం ఇంఛార్జీగా వ్యవహరిస్తుండగా, ఆ స్థానంలో సందీప్ సుల్తానియాను నియమించటం గమనార్హం. ఈ 10 విశ్వవిద్యాలయాలకు అప్పటి ప్రభుత్వం 2021లో వీసీలను నియమించగా, వారి మూడేళ్ల పదవీ కాలం నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ జనవరిలోనే వీసీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసిన సర్కార్, ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ పూర్తి చేసి సర్చ్ కమిటీలకు నియామక బాధ్యతలను అప్పగించింది. ఇంతలోనే లోక్‌సభ ఎన్నికల కోడ్ ప్రారంభం కావటంతో నియామక ప్రక్రియలో జాప్యం జరిగింది. ఇటీవల నియామక ప్రక్రియను కొనసాగించేందుకు ఈసీ పచ్చజెండా ఊపినప్పటికీ, దరఖాస్తుల స్క్రూటినీకి మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో సీనియర్ ఐఏఎస్‌లకు ఇంఛార్జీ బాధ్యతలు అప్పగించాలని సర్కారు నిర్ణయించింది. జూన్ 15లోపే పూర్తి స్థాయి నిమాయకాలు చేపట్టాలని అధికారులకు స్ఫష్టం చేసింది.