TG Formation Day Celebrations in Telangana Districts :ప్రత్యేక రాష్ట్రం సిద్ధించి పదేళ్ల పూర్తవుతున్న వేళ రాష్ట్రమంతా దశాబ్ది సంబురాలు అంగరంగ వైభవంగా జరిగాయి. కలెక్టర్లు, రాజకీయ పార్టీల నేతలు జెండా ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మంచిర్యాల జిల్లాలో అమరవీరుల స్థూపం వద్ద కలెక్టర్ నివాళులర్పించారు. మందమర్రిలో సింగరేణి కార్మికులు ఘనంగా సంబురాలు జరుపుకున్నారు. నిజామాబాద్ కలెక్టరేట్‌లో పాలనాధికారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. వేడుకల్లో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలపింపజేశాయి. డిచ్‌పల్లి మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి.
మెదక్ కలెక్టరేట్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్, ఆచార్య జయశంకర్ చిత్రపటానికి నివాళులర్పించారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, ధర్మపురి ఎమ్మెల్యే, విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వేడుకలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఆచార్య జయశంకర్, తెలంగాణ తల్లి చిత్రపటానికి పోలీసులు పుష్పాంజలి ఘటించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల, జనగామ జిల్లావ్యాప్తంగా రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాను కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ ఎగురవేశారు. రాష్ట్ర సాధనలో అసువులు బాసిన అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.
Telangana Formation Day Celebrations :మహబూబ్‌నగర్‌లో కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సమీకృత జిల్లా అధికారుల కార్యాలయానికి చేరుకుని కలెక్టర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అంబేడ్కర్ కూడలి ప్రాంగణంలో అమరవీలు స్తూపానికి నివాళులు అర్పించారు.