DGP Jitender on Ganesh Immersion 2024 :అన్ని ప్రభుత్వ విభాగాల సమన్యయంతో నగరంలో గణేష్ నిమజ్జన ఉత్సవాలను విజయవంతం చేస్తామని రాష్ట్ర డీజీపీ జితేందర్ వెల్లడించారు. ఇవాళ రాష్ట్ర పోలీసు యంత్రాంగం, జీహెచ్‌ఎంసీ అధికారులు బాలాపూర్ గణనాథుణ్ని దర్శించుకున్నారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలాపూర్ ఉత్సవ సమితి సభ్యులు అధికారులను శాలువాలతో సన్మానించారు. అనంతరం బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు మార్గాన్ని డీజీపీ జితేందర్, హైదరాబాద్ సీపీ, రాచకోండ సీపీలతో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు పరిశీలించారు.
ప్రణాళిక సిద్ధం : ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ నగరంలో గణేష్ నిమజ్జనాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు. నగరంలో బాలాపూర్ గణనాథుడి నిమజ్జనం కోసం రూట్ మ్యాప్ సిద్ధం చేశామని డీజీపీ జితేందర్‌రెడ్డి వెల్లడించారు. గత ఏడాది కంటే ఈసారి బాగా చేస్తామని నమ్మకం ఉందని ఆయన వివరించారు. గత సంవత్సరం నిమజ్జన ఉత్సవాలు ఎలా జరిపామో అదే విధంగా ప్రణాళికను సిద్దం చేసి ఫాలో అవుతుమన్నారు. ఇందుకోసం 20వేల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని వెల్లడించారు.
అదనపు బలగాలు : ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం మధ్యాహ్నం 1.30 లోపు నిమజ్జనం పూర్తి అవుతుందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 17న ఉదయం 6 గంటలకే పూజలు అన్ని పూర్తి చేసుకొని తరలించే విధంగా ప్రణాళిక సిద్దం చేశామని వివరించారు. అదే రోజు తెలంగాణ విమోచన దినోత్సవం ఉన్నందున అదనపు బలగాలను బందోబస్తులో ఉంచనున్నట్లు తెలిపారు.