Mahesh Kumar Goud Political Life : తెలంగాణ కాంగ్రెస్‌లో ఓ ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఈయన 1966 ఫిబ్రవరి 24న నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం రహత్‌నగర్‌లో సంపన్న గౌడ్ కుటుంబంలో జన్మించారు. స్థానికంగానే ప్రాథమిక విద్యను పూర్తి చేసిన ఆయన, నిజామాబాద్ గిరిరాజ్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. డిగ్రీ చదివే సమయంలోనే మహేశ్ కుమార్ గౌడ్ నిజామాబాద్ ఎన్‌ఎస్‌యూఐలో ప్రవేశించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
చిన్నవయస్సులోనే ఎన్నికల్లో పోటీ : 1986 నుంచి 1990 వరకు ఎన్ఎస్‌యూఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, 1990 నుంచి 1998 వరకు ఎన్‌ఎస్‌యూఐ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. 1998 నుంచి 2000 వరకు యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేశారు. ఆ తర్వాత 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి చిన్న వయస్సులోనే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2013 నుంచి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా పని చేశారు. తిరిగి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పీసీసీ కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించినా, ఆ ఎన్నికల్లో సదరు స్థానాన్ని అధిష్ఠానం మైనార్టీలకు కేటాయించడంతో పోటీ నుంచి తప్పుకున్నారు.
వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకం : 2018 సెప్టెంబర్ 18న రాష్ట్ర ఎన్నికల కమిటీలో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌గా పని చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకమయిన సమయంలోనే 2021 జూన్ 26వ తేదీన మహేశ్‌కుమార్ గౌడ్ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2022 డిసెంబర్ 10న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం దక్కింది. 2023 జూన్ 20వ తేదీన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు.